నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ.. మొదటిసారి ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీకి ఘన స్వాగతం పలికేందుకు కర్ణాటక క్రికెట్ సంఘం బెంగళూరులో భారీ ఏర్పాట్లు చేసింది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీ ఎత్తున అభిమానులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనపై సర్వత్రా తీవ్ర విచారం వ్యక్తమైంది. ఈ ఘటనపై ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు.
Also Read: Chinnaswamy Stadium: చిన్నబోయిన ఆర్సీబీ సంబరం.. 20 నిమిషాల్లోనే క్లోజ్!
తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, మాటలు రావట్లేదని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బుధవారం రాత్రి 10:45 గంటలకు ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ పోస్ట్ పెట్టాడు. ఇందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్‌మెంట్ చేసిన ఓ ప్రకటనను రీపోస్ట్ చేశాడు. ‘మీడియా ద్వారా మాకు తొక్కిసలాట ఘటన గురించి తెలిసింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. ఆర్సీబీ అభిమానులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యమైనది. విషయం తెలిసిన వెంటనే మా కార్యక్రమాలను రద్దు చేసుకున్నాం. మాకు మద్దతుగా నిలిచే అందరికీ ఒకటే విజ్ఞప్తి.. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని ఆర్సీబీ పేర్కొంది.
