Viral Video: తెలుగు భక్తి సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా మరోసారి గుర్తింపు లభించింది. పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ప్రసిద్ధ సంకీర్తన ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’ విదేశీ గాయకుల గళాల్లో వినిపించి అలరించింది. స్విట్జర్లాండ్‌లో నిర్వహించిన సోల్స్‌బర్గ్ ఫెస్టివల్–2026లో ప్రముఖ గాయక బృందం ‘చాంటిక్లీర్’ ఈ సంకీర్తనను ఆలపించింది.
శతాబ్దాల క్రితం అన్నమయ్య రచించిన ఈ కీర్తనలోని ఆధ్యాత్మిక భావం, భక్తి సందేశం విదేశీ గాయకుల స్వరాల్లోనూ ప్రతిధ్వనిస్తుంటే.. నిజంగా గూస్ బంప్స్ రావడం పక్కా. భాష తెలియకపోయినా, ఆ కీర్తనలోని భావాన్ని సంగీతం ద్వారా పలికించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు నేలపై పుట్టిన అన్నమయ్య సంకీర్తన అంతర్జాతీయ వేదికపై వినిపించడం తెలుగు వారందరికీ మరోసారి గర్వకారణంగా నిలుస్తోంది. దేశాలు, భాషలు వేరైనా సంగీతానికి, భక్తికి ఎల్లలు లేవని ఈ ప్రదర్శన మరోసారి చాటిచెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ ప్రదర్శనలో మరో విశేషం ఉంది. అన్నమయ్య సంకీర్తనను మనం సాధారణంగా వినే సంప్రదాయ శైలికి భిన్నంగా, పాశ్చాత్య కాపెల్లా (A Cappella) సంగీత పద్ధతిలో చాంటిక్లీర్ బృందం ఆలపించింది. ఎలాంటి సంగీత వాయిద్యాలను వాడకుండానే కేవలం గొంతులతోనే విభిన్న స్వరాలను పలికిస్తూ ఈ కీర్తనను అద్భుతంగా ఆలపించారు. ఈ ప్రదర్శన వెనుక వినీల్ గరిసా మహల్ అనే భారతీయ మూలాలున్న గాయకుడి పాత్ర కూడా ఉంది. ఆయన చాంటిక్లీర్ బృందంలో ప్రధాన గాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన చిన్నతనంలో తల్లిదండ్రులతో కారులో ప్రయాణించే సమయంలో తరచూ వినిపించే భారతీయ భక్తి కీర్తనలు తన సంగీత ప్రయాణంపై ఎంతో ప్రభావం చూపాయని వెల్లడించారు. ఇప్పుడు అదే భారతీయ సంగీత వారసత్వానికి చెందిన అన్నమయ్య సంకీర్తనను అంతర్జాతీయ వేదికపై ఆలపించడం అద్భుతంగా నిలిచింది.

