Manipur Violence: మణిపూర్ మళ్లీ అల్లర్లతో అట్టుడుకుతోంది. మైతీలకు ఎస్టీ హోదా కల్పించాలన్న అంశంపై మొదలైన అగ్గి మళ్లీ రాజుకుంది. ఇప్పటికే హింసాత్మక ఘటనల్లో అనేక మంది చనిపోయారు. కుకీలు, మైతీలు మధ్య చెలరేగిన ఘర్షణల వల్ల వేలాది మంది ఆశ్రయాన్ని కోల్పోయారు. ఇప్పటికీ అనేక మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంప్‌లలో తలదాచుకుంటున్నారు. తాజాగా, మళ్లీ అల్లర్లు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పరిస్థితి చక్కబడినట్టే కనిపించినా.. మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఇక ఉపేక్షించడానికి వీల్లేదని భావించిన బీరేన్ సింగ్ ప్రభుత్వం.. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. కనబడితే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్తున్న భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య హోరా హోరీగా కాల్పులు జరుగుతున్నాయి.
Read Also: Terrorists: మధ్యప్రదేశ్‌లో ఉగ్రవాద మూలాలు
ఇంఫాల్ లోయలోని సేక్‌మయి, సుంగు, ఫయేంగ్, సెరయు తదితర ప్రాంతాల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఎదురు కాల్పులు జరిపాయి. సుమారు 40 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టు భద్రతా బలగాల నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది. అలాగే, 10 మంది బుల్లెట్ గాయాలతో పయేంగ్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సాధారణ పౌరులపై దాడులకు తెగబడుతూ, ఇళ్లకు నిప్పు పెడుతున్న 40 మంది ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. అయితే, వాళ్లని కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేమని స్పష్టం చేశారు. వాళ్లంతా ఉగ్రవాదులని.. నిరాయుధులైన సాధారణ ప్రజలపై కాల్పులకు తెగబడుతున్నారని తెలిపారు సీఎం బీరేన్ సింగ్. గ్రామాలపై దాడులు చేస్తున్న ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి. AK-47తో పాటు అమెరికా సైనికులు ఉపయోగించే M-16 రైఫిళ్లు, కిలో మీటరుకు పైగా దూరంలో ఉన్న వాళ్లను కాల్చి చంపగల అత్యాధునిక స్నైపర్ తుపాకులున్నాయి. ఉగ్రవాదులకు ఇలాంటి అత్యాధునిక ఆయుధాలు ఎలా వచ్చాయి..? దీని వెనుక ఎవరున్నారు..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు అధికారులు.