NTV Telugu Site icon

Tuni Train Burning Case: తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసిన కోర్టు.. వారిపై చర్యలకు ఆదేశాలు

Tuni Train Burning

Tuni Train Burning

Tuni Train Burning Case: తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసింది బెజవాడ రైల్వే కోర్టు.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన రైలు దగ్ధం ఘటనను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది కోర్టు.. అయితే, రైల్వే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. దర్యాప్తు చేపట్టలేదని విజయవాడ రైల్వే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులైన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.. ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు సరిగా విచారణ చేయలేదన్న న్యాయస్థానం.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది..

Read Also: Yashaswi Jaiswal: చరిత్ర సృష్టించిన యశస్వీ.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు

అయితే, సున్నితమైన అంశాన్ని ఐదేళ్లపాటు ఎందుకు సాగదీశారని ప్రశ్నించింది కోర్టు.. ఈ కేసులో పోలీస్ ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.. ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై పెట్టిన కేసు అక్రమ కేసుగా పరిగణిస్తున్నామని పేర్కొన్న న్యాయస్థానం.. తునిలో దగ్ధం చేసిన రైలులో అంతమంది ప్రయాణిస్తే ఒకరిని మాత్రమే విచారణ చేయటం ఏంటని అసహనం వ్యక్తం చేసింది.. ఈ కేసుకు సంబంధించి మొత్తం 41 మందిని రైల్వే పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఏ1గా ముద్రగడ పద్మనాభం, ఏ2 ఆకుల రామకృష్ణ, ఏ3 మంత్రి దాడిశెట్టి రాజా సహా 41మంది నిందితులు కోర్టు ఎదుట హాజరయ్యారు. మొత్తం 24 మంది సాక్షుల్లో 20మంది విచారణకు హాజరయ్యరు. 20మందిలో ఐదుగురు తమకు ఏమీ తెలియదని సాక్ష్యం చెప్పారు. విచారణ పూర్తి కావడంతో విజయవాడ రైల్వే కోర్టు తుది తీర్పు వెల్లడించింది. కాగా, కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో.. 2016 జనవరిలో ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రైలుకు నిప్పుపెట్టడంతో హింసాత్మకంగా మారిపోయింది.. ఈ ఘటనపై అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్‌ కేసులు నమోదు చేసింది. ఇక, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కేసులన్నింటినీ ఉపసంహరించుకున్న విషయం విదితమే.