Stone pelting attack on YS Jagan Case: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై రాళ్ల దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది.. అయితే, రాత్రి సమయంలో రాళ్ల దాడి జరగడంతో ఈ కేసులు ఛేదించడంపై పోలీసులకు సవాల్‌గా మారింది.. అయినా వెనక్కి తగ్గకుండా.. కేసు దర్యాప్తు చేపట్టిన బెజవాడ పోలీసులు కీలక పురోగతి సాధించారు.. దాడికి పాల్పడిన వారిని, ఇక వారికి సహకరించిన వారిని కూడా ఈ రోజు అరెస్ట్ చూపించే అవకాశం ఉంది.. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు విజయవాడ పోలీసులు.. ఆ ఐదురు సభ్యుల బృందంలో ఒకరు దాడి చేసినట్టు దాదాపు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.. ఈ సాయంత్రం నిందితులను మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Read Also: HanuMan : టీవీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
కాగా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా జరిగిన రాయి దాడి ఘటన కేసు విచారణ నిమిత్తం 8 బృందాలు 48 గంటలు పనిచేయగా.. కీలక ఆధారాలను గుర్తించినట్టు తెలిసింది. సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ లో వైఎస్ జగన్ పై ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటలు దాటిన తర్వాత రాయితో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి కనుపాపపైన గాయమైంది. అదే సమయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం సిట్ ను ఏర్పాటు చేశారు. ఇక, ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు, పబ్లిక్ తీసిన వీడియోలు, ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా ఒక కీలక బ్రేక్ త్రూ దొరికింది పోలీసులు.. స్థానికంగా నివసించే సత్తి అతని స్నేహితులకు సీఎం జగన్‌పై దాడితో సంబంధం ఉన్నట్టు ఆధారం దొరకటంతో ఆ ఐదుగురిని మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్తి మట్టి పనిచేసుకుంటాడు. వయస్సు 17 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సత్తిని మత్తు కోసం సొల్యూషన్ తాగుతున్నాడని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని చెప్పి తీసుకెళ్ళారని సత్తి తల్లి రమణ చెబుతున్నారు. స్థానికంగా ఉన్న అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా అక్కడ సత్తి అతని స్నేహితులు లేరని వారికి ఏమీ తెలియదని వదిలి పెట్టాలని సత్తి తల్లి కోరారు. అయితే, సీఎం వైఎస్ జగన్ పై వివేకానంద స్కూల్ దగ్గర నుంచి సత్తి దాడికి పాల్పడినట్టుగా పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అయితే, మీడియా సమావేశంలో పోలీసులు ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
