విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో అత్యంత వైభవంగా శాకంబరీ ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ శాకంభరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో ప్రకృతి మాతగా దుర్గమ్మను శోభాయమానంగా అలంకరిస్తారు. దీనికోసం దుర్గా మల్లేశ్వర హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు, ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంతో తొలి విడతగా 7 టన్నుల కూరగాయలను అమ్మవారికి సమర్పించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ నేతృత్వంలో కూరగాయల దండల తయారీని ఆలయ అర్చకులు ఇప్పటికే ప్రారంభించారు.
ఈ ఉత్సవాల కోసం తాడేపల్లిగూడెం, తణుకు, మడికి, సిద్ధాంతం, ఏలూరులతో పాటు గుంటూరు జిల్లాలోని జాగర్లమూడి, తెనాలి, యడ్లపల్లి, నారాకోడూరు, మరియు కృష్ణా జిల్లాలోని నూజివీడు, చిన ఓగిరాల, పెద ఓగిరాల ప్రాంతాల నుంచి భారీగా కూరగాయలను సేకరించారు. దేవస్థానం బస్సుల ద్వారా వీటిని ఇంద్రకీలాద్రికి సురక్షితంగా తరలించారు. ఆషాఢ మాస ఉత్సవాల సందడి వేళ, ఆలయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణ నుండి శ్రీ కనకదుర్గ అమ్మవారికి బోనాలు, వివిధ ప్రాంతాల నుండి సారె సమర్పించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. గత ఆదివారం సుమారు 85 వేల మందికి పైగా భక్తులు రాగా, ఈ ఆదివారం కూడా భారీ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్, విఐపి దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వికె శీనా నాయక్ ప్రకటించారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అలాగే ఘాట్ రోడ్డు వైపు ప్రైవేట్ వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ, పూర్తిస్థాయిలో దేవస్థానం బస్సులనే నడుపుతామని అధికారులు స్పష్టం చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లులు రద్దీ లేని సమయాల్లో అనగా ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 3 నుండి 5 గంటల మధ్య దర్శనానికి రావాలని సూచించారు. భక్తులందరూ దేవస్థాన నియమాలకు కట్టుబడి అధికారులకు సహకరించాలని ఈవో విజ్ఞప్తి చేశారు.

