Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఛైర్మన్ రాంబాబు, పండితులు గురువారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికను పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములకు అందజేశారు. ఉత్సవాలను ప్రారంభించి, అమ్మవారి తొలి దర్శనం చేసుకోవాలని కోరారు. ఈనెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Also Read: IT Raids: లోకేశ్ సన్నిహితుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు
ఇంద్రకీలాద్రిపై బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకలను అక్టోబరు 15 నుంచి 23 వరకు ఘనంగా నిర్వహించాలని అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొమ్మిది రోజుల పాటు నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించాలని వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. అక్టోబరు 15న ఉదయం అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించి ఆ తర్వాత బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. అనంతరం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.