Vijayashanthi Visits Manthani: ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు మద్దతుగా కాంగ్రెస్ నేత విజయశాంతి మంథని నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన విజయభేరి భారీ బహిరంగ సభలో పాల్గొని ఆమె ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వంలో జరుగుతున్న హింసపై ఆమె మండిపడ్డారు. ‘నిరుద్యోగులను మోసం చేశావు. నేరెళ్లలో ఇసుక లారీ ఘటన.. లాయర్ వామన్ రావు దంపతులను నడిరోడ్డుపై నరికించి హత్య చేసిన ఘటన. నడిరోడ్డుపై రైతులకు సంకెళ్లు వేసి నడిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో పంటలు, గ్రామాలు మునిగిపోయాయి. మెడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయింది. ప్రకృతి కూడా సహకరించడం లేదు. కేసీఆర్ పతనం మొదలైంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.
ప్రధాని మోదీ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన అన్నారు. కానీ అమితాషా, నడ్డ ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కవిత లిక్కర్ స్కాం, దొంగలు అని తెలిసి మోదీ ఎందుకు వదిలేశారు. ఇద్దరి మధ్య తెరవెనుక ఒప్పందాలు జరుగుతున్నాయి. కేసీఆర్ గెలిస్తే తెలంగాణ చస్తుంది.. మీరు గెలిస్తే తెలంగాణా బ్రతుకుతుంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేయి పట్టుకోండి. సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రాన్ని బహుమతిగా ఇవ్వాలి. కేసీఆర్‌ను కాంగ్రెస్‌ను గెలిపించాలి. శ్రీధర్ బాబు గెలవాలనే మంథనికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన మేనిఫెస్టో రూపొందించింది. మీ ఓటు శ్రీధర్ బాబుకే వేయాలి’ అని ఆమె పిలుపునిచ్చారు.
అలాగే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘మంథని నియోజకవర్గంలో అనేక విద్యాలయాలు స్థాపించి చదువుకోవడానికి అవకాశం కల్పించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీ, వ్యవసాయ డిగ్రీ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. విద్యుత్ కష్టాలు తీర్చింది కాంగ్రెస్ పార్టీ. 2009లో 9 గంటల ఫ్రీ కరెంటు ఇచ్చాం. అనేక విద్యుత్ ప్లాంట్లు పెట్టాం. 24 గంటల విద్యుత్ ఇచ్చే సదుపాయం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మంథని ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే చంపుతాం అంటూ దాడులు చేస్తున్నారు. రౌడీయిజం, గుండాయిజం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ముంపుకు గురవుతున్న వారికి పంట నష్టం ఇస్తాం.. కరకట్టలు నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.