Site icon NTV Telugu

Kamalnath: భారత్‌ జోడో యాత్రతో చచ్చిపోతున్నాం.. మాజీ ముఖ్యమంత్రి వీడియో వైరల్

Kamal Nath

Kamal Nath

Kamalnath: కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ సహా పలువురు రాష్ట్ర నేతలు యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భారత్‌ జోడ్‌ యాత్ర కఠిన షెడ్యూల్‌పై అసహనం ప్రదర్శిస్తున్న కమల్‌నాథ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. జోడో యాత్రపై కమల్‌నాథ్‌ అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘గత వారం రోజులుగా మేం చచ్చిపోతున్నాం’’ అని ఆయన అన్నట్లుగా వీడియో ఉంది. దీంతో ఇది కాస్తా కాంగ్రెస్‌ పార్టీని కొత్త ఇబ్బందుల్లో పడేసినట్లు తెలుస్తోంది.

ఈ వీడియో ప్రకారం.. ప్రదీప్‌ మిశ్రా అనే పండింతుడితో కమల్‌నాథ్‌ మాట్లాడుతున్నారు. ‘‘గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నాం. దాంట్లో రెండు నిబంధనలుంటాయి. రోజూ ఉదయం 6 గంటలకే యాత్ర ప్రారంభించాలి. రోజుకు కనీసం 24 కిలోమీటర్లు నడవాలి’’ అని మాజీ ముఖ్యమంత్రి చెబుతున్నారు. అంతేగాక, మధ్యప్రదేశ్‌లో యాత్ర కోసం రాహుల్‌ మూడు ప్రీ కండిషన్లు పెట్టారని కమల్‌నాథ్‌ అన్నారు. ఆదివాసీ వీరుడు తాంత్య భిల్‌ జన్మస్థలం, ఓంకారేశ్వర, మహంకాళీ ఆలయాలను సందర్శించాలని రాహుల్ షరతు పెట్టారని ఆయన చెప్పారు.

Gujarat Elections: గుజరాత్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 56.88 శాతం ఓటింగ్ నమోదు

ఇందుకు సంబంధించిన వీడియోను కొన్ని స్థానిక మీడియా సంస్థలు సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. కాగా.. మధ్యప్రదేశ్‌ జోడో యాత్రలో కమల్‌నాథ్.. రాహుల్‌ వెంటే ఉన్నారు. రాహుల్‌తో కలిసి ఓంకారేశ్వర, ఉజ్జయిని మహంకాళీ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ వీడియో వైరల్‌ కావటంతో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా. ‘కమల్‌నాథ్‌ జీ.. మీ వీడియో చూశాను. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. శారీరకంగా బలహీనంగా ఉన్నవారిని యాత్రలో పాల్గొనేలా రాహుల్‌ బలవంతపెట్టొద్దని ప్రార్థిస్తున్నా. మీ యాత్ర ఎవరికీ హాని కలగకుండా చూసుకోండి’అని విమర్శించారు.

 

Exit mobile version