Site icon NTV Telugu

Uttar Pradesh: ఎమ్మెల్యే అలా చెయ్యేశాడు.. కాలేజ్ గోడ ఇలా కూలింది

Yogi, Akhilesh Yadav

Yogi, Akhilesh Yadav

సాధారణంగా ప్రభుత్వ పథకాల పనులంటేనే నాసిరకంగా ఉంటాయనేది ప్రజల నమ్మకం. కాంట్రాక్టర్లు తమ కక్కుర్తితో భవనాలను, రోడ్లను నాసిరకంగా నిర్మిస్తుంటారు. అయితే చేయి వేస్తే కూలిపోయేంత నాసిరకంగా మాత్రం భవనాలు నిర్మించడం చాలా అరుదు. ఇప్పుడు ఇలాంటి ఓ ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. అది కూడా అలాంటి ఇలాంటి భవనం కాదు.. రూ.100 కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తున్న ఓ ఇంజనీరింగ్ కాలేజ్ భవనం. నాణ్యత పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే చేయి వేయగానే భవనం గోడలు అలా కూలిపోయాయి. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఘటన యూపీలోని ప్రతాప్ గఢ్ జిల్లా రాణిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగింది. నియోజకవర్గ పరిధిలోని శివ్ సత్ లో కోట్లాది రూపాయల సర్కార్ నిధులతో నిర్మిస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు స్థానిక సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే వెళ్లారు. పనుల నాణ్యతను పరిశీలిస్తున్న సమయంలో గోడను ఒక చేత్తో తోయగానే గోడపడిపోయింది. నాసిరకం ఇసుక, సిమెంట్, ఇటుకతో నిర్మించిన గోడలను ఎమ్మెల్యే తోయగానే పడిపోయాయి. ఈ వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో షేర్ చేసిన ఎమ్మెల్యే ఆర్కే వర్మ.. ‘‘ యోగీ సర్కార్ ఆధ్వర్యంలో కొససాగుతున్న పనుల నాణ్యత ఇదీ’’ అంటూ విమర్శించారు. ఈ వీడియోను చూసిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ సింగ్ యాదవ్ బీజేపీ, యోగీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో యూపీలో అవినీతి పెరిగిందని.. అవినీతి ఏస్థాయికి చేరిందో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు అని అఖిలేష్ వ్యాఖ్యానించారు. సిమెంట్ లేకుండా ఇటుకను పేర్చితే ఇలాగే జరుగుతుందని యోగీ సర్కార్ పై సెటైర్లు వేశారు.

Exit mobile version