NTV Telugu Site icon

Rafale Jets: రాకెట్‌ దూసుకెళ్తుండగా తోడుగా వెళ్లిన రఫేల్ యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

Rafale Jets

Rafale Jets

Rafale Jets: యూరప్ అంతరిక్ష కేంద్రం ఇటీవల చేపట్టిన ఓ రాకెట్‌ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఫైటర్ జెట్‌లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రాకెట్ దూసుకెళ్తుండగా రఫేల్ యుద్ధ విమానాలు దాని వెంటే వెళ్లాయి. ఫ్రెంచ్ గయానాలోని కోరోవ్‌లో గల యూరప్ స్పేస్‌ పోర్ట్ నుంచి జులై 9న ఈ ప్రయోగం చేపట్టగా.. ముందుగా నిర్దేశించిన సమయం కంటే గంట ఆలస్యంగా ఏరియన్‌ 6 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే కొన్ని నిమిషాల అనంతరం రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. చివరి పేలోడ్‌ను విడుదల చేయకుండా నిర్ణీత మార్గం నుంచి రాకెట్‌ దారి తప్పింది. అప్పటికే అది భూవాతావరణాన్ని దాటి దూసుకెళ్లింది. తిరిగి భూవాతావరణంలోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

Read Also: Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్

ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన సైంటిస్టులు ఫ్రాన్స్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ సాయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రయోగానికి ముందే వాయుసేన దళం అక్కడ మోహరించింది. మూడు రఫేల్ యుద్ధ విమానాలు, రెండు యూరోకాప్టర్‌ ఫెన్నిక్స్‌, జర్మనీకి చెందిన ఒక పూమా ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్‌ వెహికల్ రాకెట్‌కు ఎస్కార్ట్‌లా గాల్లోకి ఎగిరాయి. దారి తప్పిన రాకెట్‌ కారణంగా గగనతలం లేదా భూమిపై ప్రమాదం చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ జెట్‌ విమానాలను పంపించారు. ఆ రాకెట్‌ వెళ్లే దిశను సముద్రం వైపుకు మళ్లించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా రాకెట్‌ సముద్రంలో కూలిపోయింది. రాకెట్‌కు తోడుగా వెళ్తున్న దృశ్యాలు రఫేల్ జెట్‌ విమానం కాక్‌పిట్‌లో రికార్డయ్యాయి. వాటిని ఫ్రాన్స్ ఎయిర్‌ అండ్ స్పేస్ ఫోర్స్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆపరేషన్‌ సక్సెస్ అంటూ రాసుకొచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.