NTV Telugu Site icon

Ranji Trophy 2024: మధ్యప్రదేశ్‌పై ఉత్కంఠ విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన విదర్భ!

Vidarbha Ranji Trophy 2024 Final

Vidarbha Ranji Trophy 2024 Final

Vidarbha set final with Mumbai in Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో విదర్భ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. చివరి రోజు వరకుఉత్కంఠగా సాగిన సెమీస్‌లో మధ్యప్రదేశ్‌ను ఓడించిన విదర్భ.. మూడోసారి రంజీ ట్రోఫీ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఇక ఫైనల్‌లో ముంబైతో విదర్భ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌ మ్యాచ్‌లో తమిళనాడుపై ముంబై గెలిచిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో ముంబై 48వ సారి రంజీ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది. మార్చి 10న ముంబై, విదర్భ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది.

శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌట్‌ అయింది. కరుణ్ నాయర్ (63) హాఫ్ సెంచరీతో రాణించాడు. మధ్యప్రదేశ్‌ బౌలర్ అవేశ్ ఖాన్ 4 వికెట్స్ పడగొట్టాడు. ఆపై తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ 252 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ హిమాన్షు మంత్రి సెంచరీ (126) బాదాడు. 82 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంబించిన విదర్భ.. 402 పరుగులు చేసింది. యశ్‌ రాథోడ్‌ సెంచరీ (141) చేయగా.. అక్షయ్‌ వాడ్కర్‌ అర్ధ శతకం (77) బాదాడు. దాంతో మధ్యప్రదేశ్‌కు 321 పరుగుల లక్ష్యంను విదర్భ విధించింది.

Also Read: Shabnim Ismail Record: మహిళా క్రికెట్‌లో రికార్డు.. అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన దక్షిణాఫ్రికా బౌలర్‌!

మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. చివరి రోజు మధ్యప్రదేశ్‌ విజయానికి 93 పరుగులు అవసరం కాగా.. విదర్భ గెలుపుకు నాలుగు వికెట్లు అవ్సరం అయ్యాయి. ఓవర్‌నైట్‌ స్కోరు 228/6 తో బుధవారం ఐదో రోజు ఆటను మొదలుపెట్టిన మధ్యప్రదేశ్‌ ఆరంభంలోనే వికెట్స్ కోల్పోయింది. కుమార్‌ కార్తికేయ (4), అనుభవ్‌ అగర్వాల్‌(6) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఆవేశ్‌ ఖాన్‌తో కలిసి సారాంశ్‌ జైన్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే సారాంశ్‌ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం ఖెజ్రోలియా (11) కూడా బౌల్డ్‌ అవడంతో మధ్యప్రదేశ్‌ ఓడిపోయింది.