వైసీపీ కొత్తగా తెచ్చిన ‘డిజిటల్ బుక్’ యాప్‌లో ఆ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు అందుతున్నాయి. మాజీ మంత్రి విడదల రజినిపై తాజాగా ఫిర్యాదు అందింది. విడదల రజినిపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, తన ఇంటిపై రజిని దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి రజినిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. సొంత డిజిటల్ బుక్ యాప్‌లో ఫిర్యాదు అందడంపై వైసీపీలో కలకలం రేపింది.
‘2022లో చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, నా ఇల్లు, కారుపై మాజీ మంత్రి విడదల రజిని దాడి చేయించారు. మాజీ మంత్రిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌కి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశా. ఈ ఫిర్యాదుపై నాకు న్యాయం చేస్తే జగన్ చెప్పినట్లు వైసీపీ కార్యకర్తలకూ న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుంది’ అని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. వైసీపీ డిజిటల్ బుక్ యాప్‌లో మాజీ మంత్రిపై ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చిన టికెట్‌ను సుబ్రహ్మణ్యం మీడియాకు చూపించారు.
Also Read: Asia Cup 2025: ఆసియా కప్ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా!
మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల వైసీపీ కార్యకర్తల కోసం ‘డిజిటల్ బుక్’ వెబ్ సైట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో యాప్‌ను లాంచ్ చేశారు. ఈ డిజిటల్ బుక్ వైసీపీ కార్యకర్తలకు శ్రీరామ రక్ష అని జగన్ చెప్పారు. ‘రెడ్ బుక్’ గురించి మాట్లాడుతున్న వారికి ‘డిజిటల్ బుక్’ సమాధానం అని పేరొన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే యాప్‌లో నమోదు చేసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా శిక్ష పడేలా చేస్తామని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాజీ మంత్రి పైనే ఫిర్యాదు అందడంతో వైసీపీలో కలకలం రేపింది.
