Vidadala Rajini: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె నివాస గేటు వద్ద యడ్లపాడు జడ్పీటీసీ అభ్యర్థి బుల్లబ్బాయిని కూడా పోలీసులు నిలిపివేశారు. తన వారిని ఇంట్లోకి ఎందుకు అనుమతించడం లేదని విడదల రజిని పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పట్ల మహిళా పోలీసు దురుసుగా ప్రవర్తించారు. చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంక అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో జరిగిన తోపులాటలో రజిని కిందపడిపోయారు. వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. గురువారం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత విడదల రజిని మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించి నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు చేస్తుంటే, ఇళ్లలోకి దూరి మరీ అభ్యర్థుల్ని లాక్కొచ్చి నామినేషన్లు విత్ డ్రా చేయిస్తుంటే ఎస్ఈసీ ఏం చేస్తోందని రజిని తీవ్రంగా మండిపడ్డారు. చిలకలూరిపేటలో టీడీపీ దాడులకు దిగుతుంటే, బెదిరించి నామినేషన్లు విత్ డ్రా చేయిస్తుంటే పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారని ఆక్షేపించారు. అర్ధరాత్రి 12 గంటల వరకూ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు విత్ డ్రా చేయించిన వ్యవహారంపై ఎస్ఈసీని కలిసి ఆధారాలు సమర్పించామని, దీనిపై తగు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి న్యాయం కోరతామని విడదల రజిని హెచ్చరించారు. “రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏ విధంగా స్థానిక ఎన్నికల్లో దాడులు, అక్రమాలకు పాల్పడుతున్నారో అందరూ చూస్తున్నారు. ఈ రెడ్ బుక్ ఎలెక్షన్ అజెండా ఒక్కటే. కూటమి అభ్యర్ధులు పోటీ కూడా పడకుండానే, వాళ్లే సుప్రీం అనుకుని, వాళ్లకే ఏకగ్రీవం కావాలని, వాళ్లే గెలిచినట్లు డిక్లరేషన్ చేసుకోవడమే ఈ రెడ్ బుక్ ఎలెక్షన్. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా విపక్ష అభ్యర్ధులు నామినేషన్లను అడ్డుకోవడం, వాళ్ల కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని వేధిస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా, దాడులు చేస్తున్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మా నాయకుడు వైఎస్ జగన్పై ఉన్న అభిమానంతో పోటీ చేయాలని ముందుకొస్తున్న వారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. అందుకే వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం.” అని రజిని వ్యాఖ్యానించారు.

