సమస్యాత్మక వార్డుల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి డీఎస్పీ మనోహరాచ్చారి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రౌడీ షీటర్స్ పై నిఘా పెంచామని చెప్పారు. టపాసులు అమ్మడం, కొనడం నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని స్పష్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వమని.. ఒక వేళ ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ జూన్ 6వ తేది వరకు అమలులో ఉంటుందని తెలిపారు. జూన్ 1 వ తేదీ నుంచి 5వ తేది వరకు తిరుపతిలో భయటి వ్యక్తులకు రూమ్స్ పై నిషేధం విధించినట్లు చెప్పారు. భక్తులకు తప్ప మిగిలిన వారికి లాడ్జి ఓనర్స్, కళ్యాణమండపాల యజమానులు రూమ్స్ ఇవ్వకూడదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు శాంతి భద్రతలకి విఘాతం కల్పించకుండా సహకరించాలని కోరారు. జూన్ 4వ తేది కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు కవ్వింపు చర్యల దిగితే కేసులు తప్పవని మరోసారి హెచ్చరించారు.
READ MORE: Dinesh Karthik-Virat Kohli: థ్యాంక్యూ డీకే.. ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా: కోహ్లీ
కాగా.. తిరుపతిలో ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు గొడవలు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రధాన పార్టీల మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరుకుంది. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరి తర్వాత ఒకరు రావడంతో తిరుపతిలోని రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్‌డీఓ) కార్యాలయం ఎదుట అధికార వైఎస్‌ఆర్‌సీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్పటి నుంచి పోలింగ్ అయిపోయాక కూడా ఘర్షణ కొనసాగింది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.