Srisailam Temple: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తులకు విభూదిధారణను ఆలయ ఈవో పెద్దిరాజు పునఃప్రారంభించారు. ఆలయ క్యూలైన్ వద్ద ఆలయంలోనికి ప్రవేశించే భక్తులకు అధికారులు విభూదిధారణ చేస్తున్నారు. నేటి నుంచి మల్లన్న ఆలయానికి వెళ్లే భక్తులకు విభూదిధారణ సాంప్రదాయాన్ని పునఃప్రారంభించారు. కొవిడ్ కారణంగా గతంలో విభూదిధారణను అధికారులు నిలిపివేశారు. క్యూలైన్ల వద్ద విభూతిధారణ ధరించి శ్రీస్వామి అమ్మవారిని దర్శనానికి వెళ్లాలని భక్తులకు ఈవో పెద్దిరాజు సూచించారు.
Read Also: Lord Ganesh: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా..?
శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు స్వామి వారి విభూదిని పరమ పవిత్రంగా భావిస్తారు. దేవస్థానం కూడా గోమయంతో స్థానిక గోశాలలో నిష్టగా విభూదిని తయారు చేయిస్తుంది. తయారీలో శాస్త్రోక్తంగా, ప్రమాణాలు పాటిస్తున్నారు. విభూది సంపదను ప్రసాదిస్తుందని, పవిత్రతను కలిగిస్తుందని భక్తులు భావిస్తారు. విభూది పాపాలను భస్మం చేస్తుంది. దీంతో పాటు అరిష్టాలన్నింటిని తొలగిస్తుంది. సమస్త శుభాలను కలిగించడంతో పాటు సర్వసంపదలను చేకూరుస్తుంది. అటువంటి సద్గుణాలను ప్రసాదించే విభూదిని ధరించడం శుభప్రదమని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతటి సుగుణాలను, పవిత్రతను కలిగిన విభూదిని శ్రీశైల దేవస్థానం తయారు చేస్తుంది.