Site icon NTV Telugu

IPL Mini Auction 2026: KKR వదిలించుకుంటే.. RCB చేరదీసిన ప్లేయర్ ఇతనే!

Venkatesh Iyer

Venkatesh Iyer

IPL Mini Auction 2026: ఐపీఎల్.. అనామకుడిని స్టార్‌ను చేస్తుంది, స్టార్‌ను అనామకుడిగా చేస్తుంది. నిజానికి ఎంతో మంది యువ ప్రతిభావంతుల జీవితాలను మార్చిన క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్. ఒకప్పుడు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లు ఈ రోజు క్రికెట్ ప్రపంచంలో స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్లు ఉన్నారు. అలాగే కనిపించకుండా పోయిన వాళ్లు కూడా ఉన్నారు. నిజానికి IPL 2025 మెగా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో భారత ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌గా నిలిచాడు. కానీ కట్ చేస్తే 2026 సీజన్ కోసం రూ.20 కోట్లు కోల్పోయి కేవలం రూ.7 కోట్లకు జట్టు మారాడు.

READ ALSO: Saudi Arabia: మరణశిక్ష అమలులో నయా రికార్డ్ సృష్టించిన ముస్లిం దేశం..

ఈరోజు ఐపీఎల్ మినీ వేలం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మినీ వేలంలోకి భారత ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ రూ.2 కోట్ల బేస్ ధరతో ప్రవేశించగా, తనని డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. గత ఐపీఎల్ సీజన్‌లో అయ్యర్‌కు ₹23.75 కోట్ల భారీ మొత్తం లభించింది. కానీ మనోడు మైదానంలో గొప్ప ప్రదర్శన చేయకపోవడంతో 2026 ఐపీఎల్ ఎడిషన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ ఆల్ రౌండర్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకుంది.

అయ్యర్ కోసం ఈ జట్ల మధ్య పోటీ..
లక్నో సూపర్ జెయింట్స్ అయ్యర్ బేస్ ధరకు బిడ్డింగ్‌ను ప్రారంభించింది, ఈ ఆల్ రౌండర్‌ను దక్కించుకోవాలని గుజరాత్ టైటాన్స్ రూ.2.60 కోట్ల వరకు బిడ్డింగ్ చేసింది. ఆ తర్వాత RCB పోటీలోకి దిగి రూ.3.20 కోట్లకు బిడ్డింగ్ వేసింది. అప్పుడు KKR కూడా బిడ్డింగ్‌లోకి దిగింది. అయితే RCB అయ్యర్‌ను సొంతం చేసుకోవాలని డిసైడ్ అయినట్లు అనిపించింది. ఇదే టైంలో అయ్యర్ కోసం KKR కూడా బిడ్‌ను పెంచడం స్టార్ట్ చేసి రూ.6.80 కోట్ల వరకు బిడ్డింగ్ చేసింది. కానీ RCB వదిలి పెట్టకుండా రూ.7 కోట్ల వరకు బిడ్డింగ్ చేసి అయ్యర్‌ను సొంతం చేసుకుంది.

2021 దుబాయ్ లెగ్ టోర్నమెంట్‌లో వెంకటేష్ అయ్యర్ తన ఐపీఎల్ ఎంట్రీని KKR తరపున చేశాడు. అయితే KKR కాకుండా వేరే ఫ్రాంచైజీ తరఫున అయ్యర్ ఐపీఎల్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ ఆల్ రౌండర్ తన అరంగేట్రం నుంచి వరుసగా ఐదు సీజన్లలో KKR తరపున ఆడాడు. IPLలో అయ్యర్ 62 మ్యాచ్‌ల్లో 29.95 సగటు, 137.32 స్ట్రైక్ రేట్‌తో 1,468 పరుగులు చేశాడు. IPL 2024 లో ఈ ఆల్ రౌండర్ 370 పరుగులు నమోదు చేశాడు. ఆ తర్వాత IPL 2025 మెగా వేలంలో వెంకటేష్ అయ్యర్‌ను కేకేఆర్ రూ. 23.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే ఆ టైంలో ఈ ఆల్ రౌండర్ ప్రదర్శన అంత గొప్పగా లేదు. దీంతో కేకేఆర్ 2026 టోర్నీ కోసం అతన్ని విడుదల చేసింది. తాజా వేలంలో ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్‌ను రూ.7 కోట్లకు దక్కించుకుంది.

READ ALSO: Akhanda 2: అవెంజర్స్ గ్రాఫిక్స్, అఖండ ఒరిజినల్.. బోయపాటి సంచలన కామెంట్స్

Exit mobile version