NTV Telugu Site icon

Devender Goud: మాజీ హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ 4 రచనల ఆవిష్కరణ.. వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Devender Goud

Devender Goud

Devender Goud: ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి , రాజ్యసభ సభ్యులు టి. దేవేందర్‌ గౌడ్‌ నాలుగు రచనలు 1) రాజ్యసభ స్పీచెస్‌ (ఇంగ్లీష్‌), 2) అంతరంగం (వివిధ రంగాలపై ఆయన అభిప్రాయాలు, 3) శాసనసభ ప్రసంగాలు 1994`99, 1999`2004 సంకలనాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ స్పీకర్‌ మరియు రాజ్యసభ సభ్యులు కేఆర్‌ సురేష్‌ రెడ్డి ఆవిష్కరించారు… ఈ సందర్భంగా దేవేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. వెంకయ్యనాయుడు తెలుగువారు గర్వించదగిన వ్యక్తి. అనేక పదవులు నిర్వహించి ఆ పదవులకే వన్నె తెచ్చారు. నేను రాజ్యసభ సభ్యునిగా ఉండగా వెంకయ్యనాయుడు కూడా సభలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభ చైర్మన్‌గా ఉండి ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి నా రాజ్యసభ ప్రసంగాలను, అంతరంగం పుస్తకాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఇక, కేఆర్‌ సురేష్‌ రెడ్డి స్పీకర్‌గా ఎంతో హుందాగా సభను నడిపేవారు. ఎంత ఒత్తిడిలో కూడా సంయమనం కోల్పోయేవారుకాదు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి నా అసెంబ్లీ ప్రసంగాలను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు దేవేందర్‌గౌడ్.. నేను 1987లో ఎన్టీరామారావు ప్రోత్సాహంతో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌గా పోటీ చేసి గెలిచిన తర్వాత 3 పర్యాయాలు శాసనసభ్యునిగా, 10 సంవత్సరాలు క్యాబినెట్‌ మంత్రిగా తదుపరి 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యునిగా పనిచేసే అవకాశం లభించింది.
నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేశాను. ప్రజా సమస్యలను సమర్ధవంతంగా చట్టసభలలో లేవనెత్తి వాటి పరిష్కారం కోసం కృషి చేశాను.
ఆ సమయంలో చట్టసభల ప్రాధాన్యత ఎంతో ఉంది. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం అందరికీ లభించేది. అందువల్లనే అనేక ప్రజా సమస్యలను లేవనెత్తగలిగాను. దేశంలో అనేక స్థాయిలలో చట్టసభలు ఉన్నాయి. వాటన్నింటికి రాజ్యసభ ఆదర్శంగా నిలుస్తుంది. అయితే, ఇటీవలి కాలంలో చట్టసభలలో చర్చలు తగ్గి వాదోపవాదాలు పెరుగుతున్నాయి. సభల ప్రిసైడిరగ్‌ అధికారులపై ఒత్తిడి పెరుగుతున్నది. పెద్దల సభగా పేర్కొనే రాజ్యసభలో కూడా పరిస్థితి భిన్నంగా లేదు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. సమర్ధులైన వారిని చట్టసభలకు పంపింనట్లయితే.. ప్రజా ప్రయోజనాలు పరిరక్షించబడతాయన్నారు దేవేందర్‌గౌడ్‌.

రచనా వ్యాసాంగం కొనసాగిస్తూ ఈరోజు 4 విలువైన పుస్తకాలను ప్రజల ముందుకు తెచ్చిన మిత్రులు దేవేందర్‌ గౌడ్‌ అభినందనలు అన్నారు వెంకయ్యనాయుడు.. చట్టసభల్లో మేలైన, నాణ్యమైన ప్రసంగాల ప్రమాణాలను నెలకొల్పిన వారిలో దేవేందర్‌ గౌడ్‌ ఒకరు. రాజకీయాల్లో 4 దశాబ్దాలు ఉండి అనేక ఉన్నత పదవులు నిర్వహించినప్పటికీ. అవినీతి మచ్చ లేకుండా ఆదర్శప్రాయంగా నిలవడం గొప్ప విషయం. చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే కలిగే ప్రయోజనం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పేందుకు దేవేందర్‌ గౌడ్‌ ప్రత్యక్ష నిదర్శనం. ఇంతకుముందు 2018లో ఆయన రాసిన రెండు పుస్తకాలను నేనే ఆవిష్కరించాను. ఓ ప్రజాప్రతినిధిగా, ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా సుదీర్ఘ అనుభవం గలిగిన దేవేందర్‌ గౌడ్‌ తన విలువైన అనుభవాలను గ్రంథస్తం చేయడం ఎంతైనా అభినందనీయం అన్నారు. 2012`18 మధ్య 6 ఏళ్లపాటు దేవేందర్‌ గౌడ్‌ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 2012`14 మధ్యకాలంలో నేను కూడా రాజ్యసభలో ఉన్నాను. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిన సందర్భం అది. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య తీవ్రమైన భావోద్వేగాలు పొడసూపిన సందర్భం కూడా అది. అటువంటి సమయంలో దేవేందర్‌ గౌడ్‌ ` తెలంగాణ ఉద్యమకారుడిగా తన ప్రాంత పరిస్థితులను, ప్రజల మనోభావాలను అవకాశం వచ్చినప్పుడల్లా రాజ్యసభలో లేవనెత్తారు. దేశ ప్రజల దృష్టికి అనేక అంశాలను రాజ్యసభ వేదికగా తీసుకువెళ్లారు. అయితే, ఆయన తన ప్రాంత సమస్యలను లేవనెత్తినప్పటికీ ఎవర్నీ నొప్పించలేదని గుర్తు చేశారు.

ఒకవైపు రాజ్యసభలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూనే, సభ వెలుపల కూడా ఆయన అనేక ఉద్యమాలు సాగించారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయ సాధన కోసం వివిధ పార్టీల నేతలతో చర్చలు జరపడం, పార్టీలతో సమన్వయం చేసుకోవడం వంటి రాజకీయ ప్రక్రియలలో చురుకైన భాగస్వామ్యం వహించారని దేవేందర్‌గౌడ్‌పై ప్రశంసలు కురిపించారు వెంకయ్య నాయుడు.. ప్రజాస్వామ్యం బలోపేతం అవ్వాలంటే చట్టసభలు పటిష్టవంతంగా పని చేయాలి. చట్టసభల ప్రయోజనాన్ని ప్రతి ప్రజాప్రతినిధి తెలుసుకొని సమర్ధవంతంగా ఉపయోగించుకోగలగాలి. తమను చట్టసభలకు పంపించిన ప్రజల పట్ల కృతజ్ఞత, బాధ్యత ప్రతి మాటలో, చర్యలో వ్యక్తం కావాలి. అయితే, ఇటీవలికాలంలో చట్టసభల ప్రాధాన్యత తగ్గుతున్న నేపథ్యంలో వాటి ఉపయోగాన్ని తెలియపర్చడం ఎంతో ముఖ్యం.
రాజకీయాల్లో పాజిటివిటీ ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. శత్రువుల్లా కాకుండా ప్రత్యర్ధుల్లా ఉండాలి. నేను ఉపరాష్ట్రపతిగా నామినేషన్‌ వేసిన మరుక్షణం నుంచే సమకాలీన రాజకీయ మీద మాట్లాడటం మానుకున్నాను. అయితే, ప్రజా జీవితంలో మాత్రం కొనసాగుతూనే ఉన్నాను. ఇక, ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. అమ్మభాష పోతే శ్వాసపోయినట్లే. ఇంగ్లీషు నేర్చుకోవాలి గానీ, వ్యామోహం పెంచుకోవద్దు. అలాగే, ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్దపెట్టాలి. ఇంట్లో వండిన వంటనే తినాలి. ఇవన్నీ నేను ప్రతి సభలో చెబుతూ ఉంటాను. కొందరైనా అనుసరిస్తారన్న నమ్మకం నాకుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

 

11