Vedant Sehwag: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చిన్న కొడుకు వేదాంత్ సెహ్వాగ్ కూచ్ బెహార్ ట్రోఫీ (Cooch Behar Trophy)లో సత్తా చాటాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. పదహారేళ్ల వేదాంత్ ఢిల్లీ అండర్-19 (Delhi Under-19) తరఫున ఆడుతూ పంజాబ్ మీద మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగులిచ్చి ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. రోపర్‌లో గురువారం మొదలైన ఈ మ్యాచ్ మొదటి రోజే పంజాబ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌట్ అయింది.
కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్నర్ అయిన వేదాంత్ సెహ్వాగ్ 22.3 ఓవర్లు వేసి, ఏకంగా ఐదు మెయిడెన్ ఓవర్లు (maiden overs) కూడా వేశాడు. పంజాబ్ టాప్ ఆర్డర్ ని దెబ్బతీసిన వేదాంత్, ఇటీవల భారత్ అండర్-19 ఆసియా కప్ (Under-19 Asia Cup) గెలిచిన జట్టులో ఉన్న పంజాబ్ కెప్టెన్ అర్జున్ రాజ్‌పుత్‌ను కూడా పెవిలియన్ పంపించాడు. ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ పెద్ద కొడుకు ఆర్యవీర్ ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు కానీ, పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఓపెనర్‌గా దిగిన పంతొమ్మిదేళ్ల ఆర్యవీర్ సెహ్వాగ్ 94 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అర్నవ్ బుగ్గాతో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టి తొలి వికెట్‌కు 24 పరుగులు జోడించాడు. ఆ తర్వాత ఆర్యవీర్, ద్వీప్ గెహ్లాట్ మధ్య రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం కుదిరింది. చివరకు పంజాబ్ ఫాస్ట్ బౌలర్ లక్ష్య కన్సల్ ఆర్యవీర్‌ను అవుట్ చేశాడు.
నిజానికి ఆర్యవీర్ సెహ్వాగ్ ఇటీవల ముగిసిన అండర్-19 ఆసియా కప్‌లో దుమ్మురేపాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో 361 పరుగులు చేసి టోర్నమెంట్‌లోనే బెస్ట్ బ్యాటర్ (best batter)గా నిలిచాడు. 90.25 సగటుతో చేసిన ఈ పరుగుల్లో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు (half-centuries) ఉన్నాయి. యూఏఈ (UAE) పై ఏకంగా 160 పరుగులు బాదిన ఆర్యవీర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ (Player of the Tournament) అవార్డు కూడా దక్కింది. అంతకుముందు వేదాంత్ సెహ్వాగ్ 2024 డిసెంబర్లో విజయ్ మర్చంట్ ట్రోఫీ (Vijay Merchant Trophy) లో ఢిల్లీ అండర్-16 తరఫున ఆడుతూ పంజాబ్ మీద నాలుగు వికెట్లు తీశాడు. అటు ఆర్యవీర్ అక్టోబర్‌లో వినూ మన్కడ్ ట్రోఫీ (Vinoo Mankad Trophy) లో చండీగఢ్‌పై 143 బంతుల్లో 173 పరుగులు చేశాడు. 2024 కూచ్ బెహార్ ట్రోఫీలోనూ మేఘాలయపై 297 పరుగులు సాధించాడు. ఓ వైపు చిన్నోడు.. మరోవైపు పెద్దోడు తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ.. అద్భుతంగా రాణిస్తున్నారు.

