NTV Telugu Site icon

VC Sajjanar : క్షేత్ర స్థాయి ఉద్యోగులు, అధికారులతో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వర్చువల్ స‌మావేశాలు

Sajjanar

Sajjanar

VC Sajjanar : త‌మ క్షేత్ర‌స్థాయి ఉద్యోగులు, అధికారుల‌తో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్ వర్చ్ వల్ సమావేశాలు నిర్వహించారు. హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా ఈ సమావేశాలు జరిగాయి. సంస్థ పనితీరు, సంక్రాంతి ఆపరేషన్స్, ఉద్యోగుల సంక్షేమం, మ‌హాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత ర‌వాణా సౌక‌ర్య ప‌థ‌క అమ‌లు, తదితర అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు.

ఈ స‌మావేశాల్లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ మాట్లాడుతూ.. సంక్రాంతికి సిబ్బంది అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. కుటుంబాలకు దూరంగా ఉండి,  పండుగను త్యాగం చేసి మరి.. ప్రయాణికులను సుర‌క్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ప్రతి ఒక్క సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్టీసీ సిబ్బంది నిబద్ధత, అంకితభావం, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తున్నారని, గత మూడేళ్లుగా సంస్థ ఇచ్చిన ప్రతి ఛాలెంజ్ ను ఉద్యోగులు విజయవంతం చేస్తున్నారని గుర్తు చేశారు.

సంస్థ పనితీరును మెరుగుపరుచుకునేందుకు క్షేత్ర‌స్థాయి ఉద్యోగులు, అధికారుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించారు. కామారెడ్డి, నర్సంపేట, మంచిర్యాల, నర్సంపేట, నాగర్ కర్నూల్, మెదక్, ఆర్మూర్, జగిత్యాల, నల్లగొండ, హయత్ నగర్-2, వరంగల్-2, బోధన్, తదితర డిపోల సిబ్బందితో ఉన్నతాధికారులు నేరుగా మాట్లాడారు.

Jack Teaser : యాక్షన్ కు యాక్షన్.. కామెడీకి కామెడీ.. టీజర్ తోనే అదరగొట్టిన స్టార్ బాయ్ సిద్ధు

కొందరు ఉద్యోగులు ఎలక్ట్రిక్ బస్సుల విషయాన్ని ప్రస్తావించగా.. సంస్థలో కొత్తగా ప్రవేశపెడుతున్న పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే డిపోల ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఎండీ సజ్జనర్ అన్నారు. ఈ ప్రచారాన్ని అసలే నమ్మొద్దని, ఎలక్ట్రిక్ బస్సులతో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించే పరిస్థితే ఉండదన్నారు. ప్రజలు ఉన్నంతా కాలం ఆర్టీసీ ఉంటుందని, ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఉద్యోగులకు అపోహ, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.

ప్రజలకు కాలుష్యరహిత రవాణా సదుపాయంతో సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా పర్యావరణహితమైన 40 ఎలక్ట్రిక్‌ బస్సులను 2019లో టీజీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన  ఈ బస్సులను సంస్థ సమకూర్చుకుంటోందని చెప్పారు.

డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్‌ నిర్వహణ పూర్తిగా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.   ఎలక్ట్రిక్‌ బస్సులను అన్ని రూట్లలో తిప్పడం సాధ్యపడదని, ప్రైవేట్ అద్దె బస్సుల మాదిరిగానే ఎలక్ట్రిక్ బస్సులన్నీ టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడుస్తాయని, ఆ బస్సుల ద్వారా వచ్చే టికెట్ ఆదాయం నేరుగా సంస్థకే వస్తోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీం వల్ల తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతమవుతోందన్నారు.  మహాలక్ష్మి వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సంస్థ సమకూర్చుకుంటోందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 3038 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని, వాటిన్నింటి నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందన్నారు. ఉద్యోగుల పెండింగ్ అంశాలన్నీ పరిశీలనలో ఉన్నాయని, దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యాజమాన్యం పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా ఉద్యోగుల సంక్షేమానికి ఆర్టీసీ పెద్ద పీట వేస్తోందని చెప్పారు. జీతాలు చెల్లించలేని పరిస్థితి నుంచి.. ప్రతి నెల ఒకటో తేదినే జీతాలను అందజేసే స్థితికి సంస్థ ఎదిగిందని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీని 21 శాతం ఫిట్ మెంట్ తో అందించడంతో పాటు  పెండింగ్‌లో ఉన్న 11 డీఏలను 2019 నుంచి దశలవారీగా ఉద్యోగులకు విడుదల చేసిందన్నారు. ఆర్పీఎస్-2013 బాండ్లకు సంబంధించిన రూ.280 కోట్లను ఆర్టీసీ ఉద్యోగాల ఖాతాల్లో సంస్థ జమచేసిందని గుర్తు చేశారు.

ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ‘గ్రాండ్‌ హెల్త్‌ ఛాలెంజ్‌’ అనే మహోత్తర కార్యక్రమానికి సంస్థ శ్రీకారం చుట్టామని అన్నారు. గ్రాండ్ హెల్త్ చాలెంజ్ పరీక్షల వల్ల తీవ్రమైన గుండె జబ్బులతో బాధపడుతున్న దాదాపు 800 మంది సిబ్బందికి ప్రాణాపాయం తప్పిందని గుర్తుచేశారు. జీవిత భాగస్వాములు బాగుంటే ఉద్యోగులు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని భావించి.. జీవిత భాగస్వాములకు వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. సిబ్బందికి మెరుగైన వైద్యం అందించేందుకు తార్నాక ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చామని వివరించారు.

Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య కలకలం..