Basara Temple: సరస్వతీ అమ్మవారి జన్మదినోత్సవమైన వసంత పంచమి ఉత్సవానికి బాసర ఆలయం రెడీ అయింది. ఏటా మాఘశుద్ధ పంచమి రోజున నిర్వహించనున్న ఈ వేడుకకు తెలంగాణతో పాటు దక్షిణ, ఉత్తర భారత రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు సరిపడే ప్రత్యేక క్యూలైన్లు, ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు, తాగునీరు, వైద్య సదుపాయాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక, క్యూలైన్‌లలో చిన్నారులకు పాలు, బిస్కెట్లు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రత్యేక అక్షరాభ్యాసం మండపాలను సైతం రెడీ చేశారు. సుమారు 70వేల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయాధికారులు పేర్కొంటున్నారు.
Read Also: Andhra Pradesh Crime: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. లవర్స్ డే రోజు ప్రాణాలు విడిచింది..!
ఇక, సరస్వతీ తల్లి జన్మదినం సందర్భంగా అక్షరభ్యాసం చేస్తే తమ చిన్నారులు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తులు నమ్ముతారు. అందుకే ఏటా వందలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. దీంతో ఇవాళ వేకువజామున రెండు గంటలకు మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవలతో ఉత్సవం స్టార్ట్ అయింది. రెండున్నర గంటల నుంచి అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ, నివేదన నిర్వహించారు. అనంతరం అక్షరాభ్యాస, కుంకుమార్చన పూజలు ఆరంభమయ్యాయి. సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారికి పల్లకి సేవను అర్చకులు నిర్వహించనున్నారు.
Read Also: Triumph Scrambler: ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X లాంచ్.. ధర ఎంతో తెలుసా?
అయితే, ఈ వేడుకల్లో ఎలాంటి అపశ్రుతి చోటు చేసుకోకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు నిర్వహిస్తుంది. ఆలయం, గోదావరి స్నాన ఘట్టాలు, పార్కింగ్ స్థలాల దగ్గర అదనపు భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన ద్వారాల దగ్గర మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో నిఘా వేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక, వసంత పంచమి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం నుంచే భక్తులు బాసరకు భారీగా తరలి వచ్చారు. నిన్న సాయంత్రానికి ఆలయ అతిథి గృహాలు, ప్రైవేటు లాడ్జీలు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. బాసరకు వచ్చే బస్సులు, రైళ్లు భక్తులతో కిటకిటలాడాయి. బాసర ఆలయానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదానం నిరంతరాయం కొనసాగుందని ఆలయ ఈఓ విజయరామారావు తెలిపారు.