Jagannaku Chebudam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు.. ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ప్రతి వినతి పరిష్కారమయ్యే వరకూ ట్రాకింగ్ చేస్తామని.. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను పొందడంలో ఎలాంటి సమస్యలున్నా తెలియచేయవచ్చు అని పేర్కొన్నారు.. సంక్షేమ పథకాలు, వైయస్ఆర్ పెన్షన్ కానుక, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైతే రైతన్నలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, మరెవరైనా సరే 1902కు ఫోన్ చేసిన వారి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్ధితి, పరిష్కారం గురించి తెలుసుకునే వీలుంది. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లతో పాటు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది. అయితే, దీనిపై టీడీపీ రాజకీయ డ్రామాకు తెరతీసే ప్రయత్నం చేసిందని వైసీపీ విమర్శిస్తోంది.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని అడ్డుకోవడానికి టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన స్టంట్ బ్యాక్ ఫైర్ అయ్యిందంటున్నారు.
ప్రజలు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం వినియోగించే గ్రీవెన్స్ సెల్ పై టీడీపీ రాజకీయం చేసే ప్రయత్నం చేసింది.. ప్రజల నిజమైన ఫిర్యాదుల పరిష్కారానికి అవకాశం ఇవ్వకుండా రాజకీయ డ్రామాలకు తెరలేపింది.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని అడ్డుకోవడవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.. జగన్నకు చెబుదాం ఉద్యోగికి కాల్ చేసి నీ దుంప తెగ అంటూ దూషించారు రామయ్య.. నీ పేరు చెప్పు.. ఫోన్ నెంబర్ చెప్పు అంటూ ఓ ఉద్యోగిని మానసికంగా వేధించే ప్రయత్నం చేశారని విమర్శిస్తున్నారు.. ఫిర్యాదుల పరిష్కారం కోసం కాకుండా 1902కి కాల్ చేసి అధికారుల సమయాన్ని రాజకీయలబ్ధి కోసం వృథా చేస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.. గ్రీవెన్స్ అధికారి ఓపికగా సమాధానం చెబుతున్నా వర్ల రామయ్య బూతుపురాణం ఆపలేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి..
అయితే, ‘జగనన్నకు చెబుదాం’ షో కార్యక్రమం.. అంతా ఉత్తుత్తికే అని.. జగనన్నకు చెబుదాం అనేది ఒక అభూతకల్పన, అబద్ధాల భ్రమ.. జగనన్నకు చెబుదామని చాలా సమస్యల్ని కాగితంపై రాసుకొచ్చాను.. 23 ఫోన్లతో 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు ట్రైచేశాను. టెక్నికల్ ప్రాబ్లెమ్ అని చెప్పి తప్పించుకుంటున్నారు.. గానీ, సమస్యలు వినడానికి ఒక్కరూ రాలేదన్నారు. ఇది ఒక షో కార్యక్రమం తప్పితే, ప్రజలకు ఉపయోగపడేది కాదన్నారు. ఏదైనా సమస్య చెప్పినా కూడా పరిష్కరించే స్థితిలో, తీర్చే స్థితిలో ప్రభుత్వం లేదన్న ఆయన.. జగనన్నకు చెబుదామని చాలా సమస్యలు రాసుకొచ్చాను.. సరైన స్పందన లేదన్నారు వర్ల రామయ్య..