NTV Telugu Site icon

France: ఫ్రాన్స్‌ ఒలింపిక్స్ క్రీడల సమయంలో కొనసాగుతున్న విధ్వంసకాండ..

Vandalism In France

Vandalism In France

France: అల్లరిమూకలు ఫ్రాన్స్‌ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా పారిస్‌లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి విద్రోహులు సవాల్ విసురుతున్నారు. తాజాగా ఈ హింస ఫైబర్, మొబైల్ నెట్వర్క్‌, ల్యాండ్‌లైన్ సర్వీసుల్ని తాకింది. ఫ్రాన్స్ చుట్టూ ఉన్న నగరాలు పారిస్ ఒలింపిక్స్ 2024 నిర్వహిస్తున్న తరుణంలో విధ్వంసకారులు మల్టీ టెలికమ్యూనికేషన్ లైన్లకు అంతరాయం కలిగించారు. ఫైబర్ లైన్లు, మొబైల్ సేవలపై ప్రభావం పడినట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.

అంతకుముందు, పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఫ్రాన్స్ చుట్టూ ఉన్న రైలు నెట్వర్క్‌పై విద్రోహ శక్తులు దాడి చేశాయి. పలు స్టేషన్లలో వ్యవస్థలను కాల్చి బుగ్గి చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం కమ్యూనికేషన్ నెట్వర్క్‌ని ధ్వంసం చేశారు. అయితే, దీని ప్రభావం ఒలింపిక్‌పై పడిందా లేదా..? అనేది అస్పష్టంగా ఉంది. డిజిటల్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ స్టేట్ సెక్రటరీ మెరీనా ఫెరారీ, ఆదివారం నుండి సోమవారం వరకు రాత్రిపూట అనేక ప్రాంతాలలో టెలికమ్యూనికేషన్స్ మౌలిక సదుపాయాలకు నష్టం జరిగిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పిరికిపంద, బాధ్యతారాహిత్యమైన చర్యల్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read Also: Israel-Hezbollah: ఇజ్రాయిల్-హిజ్బొల్లా మధ్య యుద్ధ మేఘాలు.. లెబనాన్‌లోని ఇండియన్స్‌కి కేంద్రం జాగ్రత్తలు..

ఒలంపిక్ సాకర్ మరియు సెయిలింగ్ పోటీలను నిర్వహిస్తున్న మార్సెయిల్ చుట్టూ ఉన్న ప్రాంతంతో సహా కనీసం ఆరు అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు ప్రభావితమయ్యాయని ఫ్రెంచ్ పోలీసు వెల్లడించారు. దక్షిణ ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా విద్యుత్ క్యాబినెట్‌లలోని వైర్లను కత్తిరించారని, లక్సెంబర్గ్‌ సమీపంలోని మీస్ ప్రాంతంలో మరియు పారిస్ సమీపంలోని ఓయిస్ ప్రాంతంలోని ఇన్‌స్టాలేషన్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి దిగారని అక్కడి అధికారులు తెలిపారు.

ఈ దాడుల తర్వాత ఒక వామపక్ష తీవ్రవాదిని ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం విధ్వంసకారులు ఫ్రాన్స్ హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌పై సిగ్నల్ సబ్‌స్టేషన్లు , కేబుల్‌లను లక్ష్యంగా చేసుకుని సమన్వయంతో దాడులు చేశారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు కొన్ని గంటల ముందు తెల్లవారుజామున జరిగిన దాడి కారణంగా ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం సాధారణ రైలు రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి, అయితే సుమారు 8,00,000 మంది ప్రజలు గణనీయమైన అంతరాయాలను ఎదుర్కొన్నారు.