NTV Telugu Site icon

Vallabhaneni Pankaja Sri: వంశీ చాలా ధైర్యంగా ఉన్నారు.. మేం చూసుకుంటాం అని జగన్ భరోసా ఇచ్చారు!

Vallabhaneni Pankaja Sri

Vallabhaneni Pankaja Sri

విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీ చాలా ధైర్యంగా ఉన్నారని ఆయన సతీమణి పంకజశ్రీ తెలిపారు. లీగల్‌గా తాము చూసుకుంటాం అని, భయపడవద్దు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దైర్యం చెప్పారన్నారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామని, చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. దయచేసి మహిళల మీద సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టవద్దని పంకజశ్రీ కోరారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో భర్త వంశీని ములాఖత్‌లో పంకజశ్రీ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో వైఎస్ జగన్‌, పంకజశ్రీ, సింహాద్రి రమేష్ మాట్లాడారు.

వల్లభనేని వంశీతో ములాఖత్‌ అనంతరం పంకజశ్రీ మీడియాతో మాట్లాడారు. ‘వంశీ చాలా ధైర్యంగా ఉన్నారు. వైఎస్ జగన్ లీగల్‌గా మేం చూసుకుంటాం అని భరోసా ఇచ్చారు, భయపడవద్దు అని దైర్యం చెప్పారు. సత్యవర్ధన్ కేసులో 20 వేల కోసం కిడ్నాప్ చేశారని చెప్పారు. వంశీ దగ్గర ఆ 20 వేల రికవరీ కోసం పోలీసులు 10 రోజులు కస్టడీ అడుగుతున్నారు. మేం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాం, చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నాం. సోషల్ మీడియాలో మహిళలపై పోస్టులు పెట్టకూడదు అంటున్నారు.. మా మీద అభ్యంతరకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక పార్టీకి సంబంధించిన వారే మహిళలా?.. మిగతా వారు మహిళలు కాదా?. దయచేసి మహిళల మీద సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టవద్దు’ అని పంకజశ్రీ కోరారు.

వల్లభనేని వంశీ న్యాయవాది చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘ఇవాళ ఎమినిటీస్ కోసం బెయిల్ పిటిషన్ వేశాం. కోర్టులో కొన్ని పిటిషన్లు నడుస్తున్నాయి. కొంత సమయం పట్టొచ్చు’ అని చిరంజీవి చెప్పారు. విజయవాడ జైల్లో కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ములాఖత్‌లో వంశీని పరామర్శించడానికి కొడాలి నాని,పేర్ని నాని పేర్లు కూడా వైసీపీ నేతలు ఇచ్చారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఈ ఇద్దరికీ అనుమతి ఇవ్వలేమని జైలు అధికారులు చెప్పారు.