మెగాస్టార్ చిరంజీవి విస్తరించిన ‘మెగా కాంపౌండ్’లో అందరి కంటే బుల్లి హీరో వైష్ణవ్ తేజ్. బాలనటునిగానే అలరించిన వైష్ణవ్ నేడు యువ కథానాయకునిగా మురిపించే ప్రయత్నం చేస్తున్నాడు. హీరోగా వచ్చీ రాగానే ‘ఉప్పెన’తో తన స్థాయికి ఓ భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ వైవిధ్యంతో సాగేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నాడు.
పంజా వైష్ణవ్ తేజ్ 1995 జనవరి 13న జన్మించాడు. చిరంజీవి పెద్ద చెల్లెలు కొడుకు వైష్ణవ్ తేజ్. హీరో సాయిధరమ్ తేజ్ కు స్వయానా తమ్ముడు వైష్ణవ్. ఎనిమిది సంవత్సరాల వయసులోనే తన చిన్న మేనమామ పవన్ కళ్యాణ్ నటించి, దర్శకత్వం వహించిన ‘జానీ’ చిత్రంలో నటించాడు వైష్ణవ్. అందులో చిన్నప్పటి పవన్ కళ్యాణ్ గా వైష్ణవ్ కనిపించాడు. హైదరాబాద్ లోని నలంద స్కూల్ లో చదివి, తరువాత యూసఫ్ గూడ సెయింట్ మేరీస్ కాలేజ్ లో డిగ్రీ చదివాడు. ‘జానీ’లో నటించిన తరువాత పెద్దమామ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్.’లోనూ వైష్ణవ్ ఓ చిన్న పాత్రలో కనిపించాడు. చిరంజీవి ‘అందరివాడు’లో చిన్నప్పటి చిరంజీవిగా అభినయించాడు. ఆ పై 2021లో ‘ఉప్పెన’తో హీరోగా పరిచయం అయ్యాడు వైష్ణవ్. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తరువాత వైష్ణవ్ నటించిన “కొండపొలం, రంగరంగ వైభవంగా” చిత్రాలు ఆట్టే అలరించలేకపోయాయి. ప్రస్తుతం వైష్ణవ్ ఆశలన్నీ తన రాబోయే చిత్రంపైనే ఉన్నాయి. ఈ సినిమాకు శ్రీకాంత్ యన్.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యేడాది మరికొన్ని చిత్రాలలో వైష్ణవ్ నటించే అవకాశం ఉంది.