Vaikuntha Ekadashi: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ఉత్తర ద్వార దర్శనాలతో ఆలయాలు కిటకిటలాడాయి.
సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లాలోని వైకుంఠపురం ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ సతీసమేతంగా పాల్గొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి పల్లకి సేవలో భక్తులతో కలిసి పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లాలోని పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. డోర్నకల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేష పూజలు జరగగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఆలయం, మంగ మఠం శ్రీ రామ సత్యనారాయణ స్వామి ఆలయం, శ్రీరామ చంద్ర గోపాల కృష్ణ మఠంలో ఉదయం నుంచే ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగాయి.
కరీంనగర్ జిల్లా: అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. జమ్మికుంట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక అలంకరణతో ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయగా, తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదే విధంగా కాళేశ్వరంలో కూడా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ రామాలయంలో ఉదయం 5.30 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. అంతకుముందు గరుడ వాహనంపై సీతా సమేత రామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకు తిరుప్పావై సేవ, చతుర్వేద పారాయణం, విశేష పూజలు నిర్వహించి ఏకాదశ హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మహేష్, స్తానికులు, భక్తులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: హరిహర క్షేత్రమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ప్రాతఃకాల పూజలు, పల్లకి సేవ, అంబారి సేవలతో పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. వైకుంఠ ద్వారం గుండా దర్శనానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఉదయం 3 గంటలకు లక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నరసింహ, వెంకటేశ్వర స్వాముల మూలవిరాట్‌లకు మహా క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా: బాన్సువాడలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
నిజామాబాద్ జిల్లా: ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. ఉత్తర తిరుమల క్షేత్రం, జెండా బాలాజీ ఆలయం, కోదండ రామాలయం, నర్సింగ్‌పల్లి ఇందూరు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.