Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..

Vaibhav Suryavanshi (2)

Vaibhav Suryavanshi (2)

క్రికెట్ ప్రపంచంలో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఈ యువ సంచలనం, ఇటీవల భారత్-ఎ తరఫున కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు భారత్-ఐర్లాండ్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమవడంతో అతడి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది.

టికెట్లకు భారీ డిమాండ్ – క్షణాల్లో ఖాళీ
నేడు బెల్‌ఫాస్ట్‌లోని స్టార్‌మాంట్ మైదానంలో జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్ అరంగేట్రం (Debut) చేయబోతున్నాడనే వార్తతో అభిమానులు ఎగబడ్డారు. ఐర్లాండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ బ్రియాన్ తెలిపిన వివరాల ప్రకారం.. వైభవ్ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు సాధారణం కంటే మూడు రెట్ల డిమాండ్ వచ్చింది. దీనితో మ్యాచ్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా క్షణాల్లో అమ్ముడయ్యాయి. వైభవ్ చారిత్రాత్మక క్షణాన్ని వీక్షించేందుకు అతని తల్లిదండ్రులు కూడా ఇప్పటికే బెల్‌ఫాస్ట్‌ చేరుకున్నారు.

వేదిక ఎంపికపై తీవ్ర విమర్శలు..
అయితే, ఇంతటి భారీ క్రేజ్ ఉన్న మ్యాచ్‌ను కేవలం 4,200 నుండి 6,000 వరకు మాత్రమే సీటింగ్ సామర్థ్యం ఉన్న చిన్నదైన బెల్‌ఫాస్ట్ మైదానంలో నిర్వహించడంపై క్రికెట్ అభిమానుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

డబ్లిన్ వేదిక ఎందుకు కాలేదు?: గతంలో భారత్ ఆడిన మ్యాచ్‌లన్నీ దాదాపు 12,000 సామర్థ్యం కలిగిన డబ్లిన్‌లోని మలాహైడ్ స్టేడియంలో జరిగాయి. కానీ ఈసారి అక్కడ మ్యూజిక్ కాన్సెర్టులు ఉండటం వల్ల వేదికను బెల్‌ఫాస్ట్‌కు మార్చాల్సి వచ్చింది. ఇటీవల బెల్‌ఫాస్ట్‌ నగరంలో స్థానికంగా కొన్ని అల్లర్లు జరగడంతో భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే క్రికెట్ ఐర్లాండ్ అంతా సవ్యంగానే ఉందని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టి, అత్యంత పిన్న వయస్కుడిగా భారత జట్టులో చోటు సంపాదించిన వైభవ్ సూర్యవంశీ మ్యాచ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని టీమిండియా నేడు ఐర్లాండ్‌తో తలపడనుండగా, అందరి కళ్లూ ఈ 15 ఏళ్ల యువ కిరటంపైనే ఉన్నాయి.