Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!

Vaibhav Sooryavanshi (1)

Vaibhav Sooryavanshi (1)

Vaibhav Sooryavanshi Reveals Yuvraj Singh Advice: యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 53 బంతుల్లోనే అజేయంగా 204 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 28 సిక్సర్లు బాదాడు. అతడి మెరుపు బ్యాటింగ్‌తో భారత్-A జట్టు 250 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించింది. అయితే ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ వెనుక టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సలహాలు కూడా ఉన్నాయని వైభవ్ వెల్లడించాడు.

మ్యాచ్‌కు ముందు తన తండ్రి, కోచ్, ఓ స్నేహితుడితో పాటు తన అభిమాన క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో మాట్లాడినట్లు వైభవ్ తెలిపాడు. బ్యాటింగ్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను యువరాజ్‌తో పంచుకున్నానని.. దాంతో యువీ తనకు పలు సాంకేతిక విషయాలను వివరించడంతో పాటు కొన్ని కీలక సూచనలు చేశాడని వెల్లడించాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో 20 బంతులు ఎదుర్కొనే అవకాశం వస్తే.. ఆ బంతులను విభిన్నమైన శైలిలో ఆడాలని యువరాజ్ సింగ్ చెప్పినట్లు వైభవ్ తెలిపాడు. ఆ సలహా తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పాడు. యువరాజ్‌ను తన ఆదర్శంగా భావిస్తానని, ఆయన సూచనలను తన బ్యాటింగ్‌లో అమలు చేసేందుకు ప్రయత్నించానని వివరించాడు.

యువరాజ్ సలహాలతో పాటు తన బ్యాటింగ్‌లోని లోపాలను గుర్తించేందుకు వైభవ్ ప్రత్యేకంగా శ్రమించానని తెలిపాడు. గతంలో ఆడిన మ్యాచ్‌ల వీడియోలను పరిశీలించి, ఎక్కడ తప్పులు చేస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసానని.. వాటిని వీలైనంత వరకు సరిదిద్దుకుని మైదానంలోకి దిగనని పేర్కొన్నాడు. ఈ కసరత్తు ఫలితమే యూఏఈపై అద్భుత ఇన్నింగ్స్‌లో కనిపించింది.