Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం దక్కకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించారు. ప్రస్తుత జట్టు కూర్పులో వైభవ్‌కు సహజంగా అవకాశం రావడం కష్టమని, అతడి కోసం టీమ్ మేనేజ్‌మెంట్ ప్రత్యేకంగా చోటు కల్పించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
వైభవ్ సూర్యవంశీ ప్లేయింగ్ XIలోకి రావాలంటే సంజూ శాంసన్, అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిషన్ లలో ఒకరి స్థానంలోనే ఆడాల్సి ఉంటుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. అయితే ఈ ముగ్గురూ పరుగులు చేస్తున్న సమయంలో వారిలో ఎవరినైనా పక్కన పెట్టడం అంత సులభం కాదన్నారు. తన యూట్యూబ్ ఛానల్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. వైభవ్‌కు అవకాశాలు రాకపోవడానికి ప్రధాన కారణం జట్టులో అతడికి స్థానం లేకపోవడమేనన్నారు. సంజూ, అభిషేక్, ఇషాన్‌లలో ఒకరి స్థానంలో మాత్రమే అతడిని ఆడించగలమని, ముగ్గురూ బాగా రాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒకరిని తప్పించడం కష్టమని చెప్పారు. అయితే రోటేషన్ విధానం ద్వారా నలుగురికీ అవకాశాలు కల్పించవచ్చని సూచించారు.
ఇంకా వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించే అవకాశం లేకపోతే అతడిని జట్టులో ఉంచడం కంటే రంజీ ట్రోఫీలో ఆడేందుకు అవకాశం ఇవ్వడం మంచిదని చోప్రా అభిప్రాయపడ్డారు. మ్యాచ్‌లు ఆడకుండా బెంచ్‌కే పరిమితం చేయడం ఆటగాడికి పెద్దగా ఉపయోగపడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక వైభవ్ కోసం తిలక్ వర్మను జట్టు నుంచి తప్పించాలనే వాదనను ఆకాశ్ చోప్రా సమర్థించలేదు. తిలక్ మూడో స్థానంలో ఆడుతూ రెండు సెంచరీలు సాధించాడని గుర్తుచేశారు. గాయం తర్వాత కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ.. ఫినిషర్‌గా మారిన తర్వాత మంచి ప్రదర్శన చేస్తున్నాడన్నారు. ఆసియా క్రీడలతో పాటు ఇటీవలి మ్యాచ్‌ల్లోనూ తిలక్ వర్మ మిడిల్, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో సమర్థంగా రాణిస్తున్నాడని చోప్రా పేర్కొన్నారు. అందువల్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించేందుకు తిలక్ వర్మను లక్ష్యంగా చేసుకోవడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు.

