Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!

Vaibhav Sooryavanshi (2)

Vaibhav Sooryavanshi (2)

Vaibhav Sooryavanshi: భారత్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్-Aతో జరుగుతున్న మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన వైభవ్, హాఫ్ సెంచరీకి చేరువలో అనవసర షాట్ ఆడి వికెట్ కోల్పోయాడు.

టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్-A ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్-A తరఫున ఓపెనర్లుగా వచ్చిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే వేగంగా పరుగులు సాధించారు. ముఖ్యంగా వైభవ్ తన సహజ శైలిలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లతో 44 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్‌ కు ఎండ్ కార్డు పడింది. 200 స్ట్రైక్‌రేట్‌తో అఫ్గాన్ బౌలర్లపై ఎదురుదాడి చేసిన అతడు అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించాడు.

×
×
Ad

అయితే 7.1వ ఓవర్‌లో అబ్దొల్లా అహ్మద్‌జాయ్ వేసిన షార్ట్ బాల్‌ను వికెట్ కీపర్ మీదుగా ర్యాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన వైభవ్ బ్యాట్‌కు స్వల్పంగా తాకిన బంతి నేరుగా వికెట్ కీపర్ మొహమ్మద్ ఇషాక్ చేతుల్లో పడింది. దీంతో 44 పరుగుల వద్ద అతడి ఇన్నింగ్స్ ముగిసింది. ముఖ్యంగా మంచి ఆరంభం లభించినప్పటికీ దాన్ని పెద్ద స్కోరుగా మార్చుకోలేకపోవడం వైభవ్‌కు పునరావృతమవుతున్న సమస్యగా కనిపిస్తోంది. మరోసారి నిర్లక్ష్య షాట్ కారణంగా విలువైన వికెట్ కోల్పోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అయితే అతడు ఆడిన దూకుడు ఇన్నింగ్స్ భారత్-Aకు శుభారంభాన్ని అందించింది. వైభవ్ ఔటయ్యే సమయానికి భారత్-A జట్టు 7.2 ఓవర్లలో 74 పరుగులు చేసింది. మరోవైపు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 28 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు.