NTV Telugu Site icon

IAS Officer: పేషెంట్‌లా ఆస్పత్రికొచ్చిన ఐఏఎస్ ఆఫీసర్.. ఆ తర్వాత ఏం చేశారంటే..!

Up

Up

అది ప్రభుత్వాస్పత్రి.. లోపల ఏం జరుగుతుందో.. రోగులకు ఎలాంటి వైద్యం అందుతుందో.. డాక్టర్లు, సిబ్బంది ఎలా పని చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు ఐఏఎస్ ఆఫీసర్. అంతే ఎలాంటి హంగు, ఆర్భాటాలతో కాకుండా ఒక సామాన్య పేషేంట్‌లా ఆస్పత్రి లోపలికి ఎంట్రీ ఇచ్చారు.. ఆస్పత్రి మొత్తం కలయ తిరిగి చూశారు. లోపల జరుగుతున్న బాగోతం చూసి తన ప్రతాపాన్ని చూపించారు ఆఫీసర్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఫిరోజాబాద్‌లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోకి ఐఏఎస్ అధికారి క్రతిరాజ్ రహస్యంగా రోగిలా మారువేషంలో ప్రవేశించారు. ఆస్పత్రి అంతటిని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడ జరుగుతున్న లోపాలను గుర్తించారు. ఇంత జరుగుతున్న ఆస్పత్రి సిబ్బంది ఏ మాత్రం కనిపెట్టలేకపోయారు.

రోగులు ఎదుర్కొంటున్న అసౌకర్యాల గురించి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ మేరకు ఆమె రహస్య పరిశోధనకు పూనుకున్నారు. ఆమె గుర్తింపును దాచిపెట్టి వైద్య విభాగాల్లోకి చొరబడ్డారు. రహస్య ఆపరేషన్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నారు. డాక్టర్ల గైర్హాజరు కావడమే కాకుండా పని చేస్తున్న సిబ్బంది పని తీరు కూడా ఏ మాత్రం సరిగ్గా కనిపించలేదు. దీంతో ఆమె డాక్టర్లు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఔషధాలు పంపిణీ చేసే స్టోర్ రూమ్‌ను కూడా పరిశీలించారు.. అన్ని మందులు గడువు ముగిసిన మందులుగా గుర్తించి విసిరి పారేశారు. అలాగే మరికొన్ని ప్రమాదకరమైన మందులను గుర్తించారు. ఆస్పత్రిలో అవసరమైన సిబ్బంది ఉండి కూడా ఎందుకు ఇలా చేస్తు్న్నారంటూ మండిపడ్డారు. అలాగే ఆస్పత్రిలో ఎక్కడా కూడా పరిశుభ్రత కనిపించలేదు. కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో మండిపడ్డారు.

అలాగే కొంత మంది డాక్టర్లు.. రోగులతో సరైన విధంగా వ్యవహరించకపోవడాన్ని కూడా ఆమె గుర్తించారు. అన్ని సాక్ష్యాలను సేకరించిన తర్వాత ఆమె.. దర్యాప్తునకు ఆదేశించారు.

ఇదిలా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ క్రతి రాజ్ ఆరోపణలను చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబదన్ రామ్ ఖండించారు. గడువు ముగిసిన మందులను ఉపయోగించడంలేదని.. అలాంటి మందులను ఓ పెట్టెలో పెట్టి దాచినట్లు చెప్పారు. అలాగే ఆస్పత్రిలో కూడా పరిశుభ్రత బాగానే ఉందని ఆయన కితాబు ఇచ్చారు.

కృతి రాజ్.. ఉత్తరప్రదేశ్‌లోని సదర్‌కు చెందిన సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)గా పని చేస్తున్నారు. రహస్యంగా ఆస్పత్రిని పరిశీలించి విచారణకు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.