Ayodhya: అయోధ్యలో రామ మందిరం పరిసర ప్రాంతాల్లో మాంసాహార ఆహారంపై కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. రామ మందిరం చుట్టూ 15 కిలోమీటర్ల పరిధిలో మాంసాహార ఆహార పదార్థాల డెలివరీని పూర్తిగా నిషేధిస్తూ జిల్లా పరిపాలన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పంచకోశి పరిదక్షిణ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా మాంసాహార ఆహారం సరఫరా అవుతోందన్న ఫిర్యాదులు పదేపదే రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా, అయోధ్యలోని కొన్ని హోటళ్లు, హోమ్‌స్టేలు అతిథులకు మాంసాహారం, మద్యం అందిస్తున్నట్లు కూడా సమాచారం అందిందని అధికారులు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత సంస్థలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటికే 2025 మే నెలలో అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్, అయోధ్య–ఫైజాబాద్‌ను కలిపే సుమారు 14 కిలోమీటర్ల రామ్ పథ్ మార్గం వెంట మాంసం, మద్యం అమ్మకాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తొమ్మిది నెలలు గడిచినా మద్యం అమ్మకాలపై నిషేధం సమర్థంగా అమలు కాలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కూడా ఆ మార్గం వెంట రెండు డజన్లకు పైగా మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందించిన ఓ మున్సిపల్ అధికారి, రామ్ పథ్ వెంబడి ఉన్న మాంసం దుకాణాలను తొలగించామని, ఫైజాబాద్ ప్రాంతంలో ఉన్నవాటినీ మూసివేశామని తెలిపారు. అయితే మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలంటే జిల్లా పరిపాలన నుంచి ప్రత్యేక అనుమతి అవసరమని వివరించారు.
READ MORE: IND vs NZ: జోరుగా టీమిండియా ప్రాక్టీస్.. ఈసారైనా సిరీస్ గెలిచేనా..?
ఈ అంశంపై అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ మణిక్ చంద్ర సింగ్ మాట్లాడుతూ.. నిషేధం ఉన్నప్పటికీ పర్యాటకులకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మాంసాహార ఆహారం చేరుతోందన్న ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఆన్‌లైన్ మాంసాహార ఆహార డెలివరీపై పూర్తిస్థాయి నిషేధం విధించామని తెలిపారు. హోటళ్లు, దుకాణదారులు, డెలివరీ సంస్థలన్నింటికీ ఈ నిర్ణయాన్ని తెలియజేశామని, నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది నిరంతరం పర్యవేక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.