వానాకాలం, యాసంగి 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ డా.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, పౌర సరాఫరాల శాఖ అధికారులతో కష్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) వానాకాలం, యాసంగి పై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వానాకాలం, యాసంగి 2022-23 కు సంబంధించి మిల్లర్లకు కేటాయించిన రోజు వారి లక్ష్యాలను డైలీ టార్గెట్ పూర్తి చేయుటకు జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ, మంత్రిగారి సూచనల మేరకు జిల్లాలో ఎలాంటి జాప్యం లేకుండా సీఎంఆర్ డెలివరీ టార్గెట్ పూర్తి చేయడానికి వెంట వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్యాలు పూర్తి అయ్యేంతవరకు సంబంధిత మిల్లులలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
