Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. మంత్రి తాజాగా బుధవారం మీడియాతో మాట్లాడారు. తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు భగీరథ ద్వారా ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ సమిష్టిగా నాలుగు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు తెచ్చారని వివరించారు. ప్రతీ ప్రతిపాదనకు అయ్యో ఖర్చు, అనుకూల, ప్రతీ కూలతలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరగనున్న సమీక్షా సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణకు అవసరమైన పరీక్షలను వర్షాకాలం లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

“ప్రతీ 1.5 మీటర్ల దూరంలో ఎస్పీటీ టెస్ట్‌లు నిర్వహించాలి. ప్రతీ మూడు మీటర్ల దూరంలో పెర్మిబిలిటీ టెస్ట్‌లు జరపాలి. బోర్లు వేస్తున్న సమయంలో రాయి వచ్చినప్పటికీ రాయి లోపటికి 5 మీటర్లు లోతుగా బోర్లు వెయ్యాలి. బ్యారేజ్ ల పునరుద్ధరణ కోసం నియమించిన సమన్వయ కమిటీ బ్యారేజ్‌లను సందర్శించి టైంలైన్‌ను ఫిక్స్ చేసుకోవాలి. CWPRS డైరెక్టర్ క్షేత్ర స్థాయిలో ఉంటూ పునరుద్ధరణకు అవసరమైన పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలి. పునరుద్ధరణ కోసం జరుగుతున్న పురోగతి పనుల వివరాలను ఎప్పటికప్పుడు NDSAకు సమగ్రంగా సమాచారం అందించాలి.” అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా.. ఈ రోజు సాయంత్రం ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఆ శాఖ అధికారులతో భేటీ కానున్నారు. తుమ్మిడిహట్టిపై ఈ భేటీ అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల రిపేర్లపై స్పష్టత రానుంది.