NTV Telugu Site icon

Hamas: మూల్యం చెల్లించుకుంటారు.. అమెరికాకు హమాస్ వార్నింగ్

Joe

Joe

పశ్చిమాసియా మరోసారి నివురుగప్పిన నిప్పులా మారింది. అమెరికా జరిగిస్తున్న బాంబుల దాడితో దద్దరిల్లుతోంది. దీంతో గత కొద్దిరోజులుగా రక్తపుటేరులు పారుతున్నాయి. ఇక జోర్డన్‌లో ఇటీవల మిలిటెంట్లు జరిపిన డ్రోన్ దాడుల కారణంగా ముగ్గురు అమెరికన్ సైనికులు మృత్యువాతకు గురయ్యారు. దీనికి ప్రతీకారంగా సిరియాలో మిలిటెంట్ల స్థావరాల లక్ష్యంగా అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్‌ మద్దతిస్తున్న 40 మంది మిలిటెంట్లు మరణించినట్లు తెలుస్తోంది.

హమాస్ వార్నింగ్…
ఇరాక్‌, సిరియాలోని ఇరాన్‌ (Iran) మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డుల స్థావరాలపై అమెరికా (USA) దాడులు చేయడాన్ని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ (Hamas) తీవ్రంగా తప్పుబట్టింది. ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌ చర్య అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉందని పరిగణించింది. ఆయా దేశాల్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు అమెరికా పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేసింది. ఇజ్రాయెల్‌కు సాయం చేస్తూ పాలస్తీనాలోని సామాన్యులను బలి తీసుకుంటోందని విమర్శించింది. ఇలాంటి చర్యలతో ఉద్రిక్తతలు మరింత ఎక్కువవుతాయే తప్ప.. తగ్గబోవని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ దురాక్రమణ, గాజాలోని ప్రజలపై మారణహోమానికి ముగింపు పలికినప్పుడే ఆయా ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇటీవల అమెరికా సైనిక క్యాంప్‌పై డ్రోన్‌ దాడి జరగడంతో ముగ్గురు సైనికులు మృతి చెందారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అగ్రరాజ్యం.. ఇరాక్‌, సిరియాల్లోని 85 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఇరాన్‌ మద్దతిస్తున్న 40 మంది మిలిటెంట్లు మరణించినట్లు యూకేలోని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ సంస్థ వెల్లడించింది. అలాగే ఇరాక్‌లో 16 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు బాగ్దాద్‌ తెలిపింది.