Site icon NTV Telugu

US – China: చైనా సహాయం కోరిన అమెరికా.. ఏ విషయంలో అంటే!

Us China Relations

Us China Relations

US – China: ఉప్పు – నిప్పులా ఉన్న అమెరికా – చైనా మధ్య కొత్త చర్చలు మొదలయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆసియా పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చిస్తానని చెప్పారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అదుపులో ఉంచడానికి చైనాను సహాయం చేయాలని కోరారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. “మేము రష్యాపై చాలా ముఖ్యమైన ఆంక్షలు విధించాము. చాలా కఠినమైన, అలాగే చాలా బలమైన ఆంక్షలు. మాస్కోపై వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని నేను భావిస్తున్నాను” అని చెప్పారు.

READ ALSO: PIA UK Flights: ఐదేళ్ల నిషేధం తర్వాత.. UKకి విమానాలను తిరిగి ప్రారంభించిన పాకిస్తాన్..

ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా సమస్యలో చైనా అమెరికాకు సహాయం చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. “మేము రష్యాపై కఠినమైన చర్యలు తీసుకున్నాము, కానీ చైనా సహకరిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది” అని ఆయన వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒక పక్క మాస్కోపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ, రష్యా తన సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

డోనాల్డ్ ట్రంప్ ఈ వారంలో ఒక ప్రధాన ఆసియా పర్యటనకు బయలుదేరుతున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా మలేషియా, జపాన్, దక్షిణ కొరియాలను సందర్శిస్తారు. అలాగే ఆయన ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాత్రమే కాకుండా అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలను కూడా చర్చించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా సహకరిస్తే, ఉక్రెయిన్‌లో శాంతికి కొత్త మార్గాలు తెరుచుకోవచ్చని ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు. ట్రంప్ ముందుగా మలేషియాలో జరిగే ఆసియాన్ సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని బుసాన్‌కు వెళతారు. అక్కడ APEC సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు అనంతరం ఆయన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌‌తో సమావేశం అవుతారు. ఈ పర్యటన అనేక విధాలుగా ముఖ్యమైనదిగా చెబుతున్నారు. ఒకవైపు ఆసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తూనే, మరోవైపు రష్యాకు వ్యతిరేకంగా చైనాను దౌత్య భాగస్వామ్యంలోకి తీసుకురావడానికి కూడా ఆయన ముమ్మరంగా పావులు కదుపుతున్నారు.

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి మాస్కో – వాషింగ్టన్ – కీవ్‌ దౌత్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి దగ్గరగా ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక రాయబారి కిరిల్ డిమిత్రివ్ వెల్లడించారు. మాస్కో చమురు రంగంపై అమెరికా కొత్త ఆంక్షల కారణంగా యూఎస్ – రష్యా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ తరుణంలో డిమిత్రివ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

READ ALSO: WhatsApp Tips: ఇలా చేస్తే వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవచ్చు!

Exit mobile version