Site icon NTV Telugu

USA-UK: అమెరికా- బ్రిటన్ మధ్య చిచ్చు పెట్టిన టీ.. రంగంలోకి రెండు దేశాల నేతలు

Us Uk

Us Uk

అమెరికా- బ్రిటన్ దేశాల మధ్య ఈ టీ వల్ల వివాదం చెలరేగింది. యూఎస్ కు చెందిన ఓ ప్రొఫెసర్‌ టీ ఎలా తయారు చేయాలో చెబుతూ చేసిన సూచన బ్రిటన్ వాసులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పాడింది. అయితే, పెన్సిల్వేనియాలోని బ్రైన్ మావర్ కాలేజీలో మిషెల్‌ ఫ్రాంక్‌ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అయితే, టీని ఎలా తయారు చేయాలో చాలా రీసెర్చ్ చేశానని స్వయంగా ఆమె చెప్పారు. అందుకోసం పురాతన గ్రంథాలను సైతం తిరగేశాను అని పేర్కొన్నారు. ఛాయ్ చక్కగా కుదరాలంటే దాంట్లో చిటికెడు ఉప్పు వేయాలని ఆమె సూచించారు. ఇదే విషయాన్ని ఆమె ‘స్టీప్డ్‌: ది కెమిస్ట్రీ ఆఫ్‌ టీ’ అనే పుస్తకంలో రాసుకొచ్చింది. ఆ పుస్తకం కాస్తా ఇటీవలే యూకేలో విడుదలైంది.

Read Also: IND vs ENG: ఉప్పల్ టెస్ట్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్! కోహ్లీ స్థానంలో రాహుల్

ఇక, బ్రిటన్ జాతీయ పానీయం తేనీరు.. అందులో ఉప్పు కలపాలంటూ పుస్తకంలో ఫ్రాంక్‌ చేసిన సూచన యూకే ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు.. దీంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఇక, చాలా మంది సోషల్ మీడియాలో అమెరికాపై విమర్శలు గుప్పించారు. ఈ వివాదానికి ముగింపు పలకడానికి లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఏకంగా రంగంలోకి దిగింది. చక్కటి టీ కోసం అమెరికన్ ప్రొఫెసర్ చేసిన సూచన యూకేతో మా బంధాన్ని ఇరకాటంలోకి నెట్టింది అని పేర్కొనింది. ఇది ఇరు దేశాలను కలిపే అమృత పానీయం.. ఈ బంధాన్ని సవాల్‌ చేసే ఎలాంటి ప్రతిపాదనలనూ తేలిగ్గా తీసుకోలేమన్నారు. కప్పు టీలో ఉప్పు కలపడం మా అధికారిక విధానం కాదు.. భవిష్యత్‌లో కూడా ఉండదు అని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. అయితే, ఈ వివరణ చివరలో టీని సరైన మార్గంలో మైక్రోవేవ్‌ ఒవెన్‌లోనే తయారు చేస్తామంటూ అమెరికా రాయబార కార్యాలయం చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు దారి తీసింది. ఇక, ఈసారి బ్రిటన్‌ ప్రభుత్వమే ఏకంగా రంగంలోకి దిగింది. ఈ పానీయాన్ని కేవలం కెటిల్‌లో మాత్రమే చేయాలంటూ క్యాబినెట్‌ ఆఫీస్‌ ట్విట్టర్ (ఎక్స్‌)లో పోస్ట్‌ చేసింది.

Exit mobile version