US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం..

Trump

Trump

US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. ఊహించని పరిణామాల మధ్య యూఎస్ సెనేట్‌ను డెమోక్రాట్లు దక్కించుకుని తమ ఆధిక్యాన్ని చాటుకున్నారు. దశాబ్దాలుగా రిపబ్లికన్ల కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో డెమోక్రాట్లు ఘన విజయం సాధించి వర్జీనియా నుంచి టెక్సాస్ వరకు వీచిన “బ్లూ వేవ్”తో తమ పాగా వేశారు. ముఖ్యంగా టెక్సాస్, కాన్సాస్, ఓహియో వంటి కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్లు తమ హవా చాటారు. టెక్సాస్ సెనేట్ స్థానంలో దశాబ్దాల తర్వాత డెమోక్రాటిక్ అభ్యర్థి ఘన విజయం సాధించగా, కాన్సాస్‌లో ఏకంగా దాదాపు 94 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సెనేట్ సీటును డెమోక్రాట్లు కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఇక రిపబ్లికన్లకు తిరుగులేని కోటగా పరిగణించే సౌత్ కరోలినాలో కూడా సెనేట్ స్థానాన్ని డెమోక్రాట్లు దక్కించుకోవడం విశేషం. ఈ సంచలన విజయాలతో సెనేట్‌లో మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసిన డెమోక్రాట్లు, ట్రంప్ ప్రస్తుత పదవీకాలం ముగిసే వరకు సెనేట్, కాంగ్రెస్ రెండింటిపై పూర్తి నియంత్రణను సాధించారు. ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు అమెరికా రాజకీయంలో ట్రంప్ ఆధిపత్యానికి పెద్ద చెక్ పెట్టడమే కాకుండా, రాబోయే రోజుల్లో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై డెమోక్రాట్ల ప్రభావం బలంగా ఉండబోతోందని స్పష్టం చేస్తున్నాయి.

ఇక, ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తాజాగా ట్రంప్ స్పందించారు. ఈ ఫలితాలపై అసహనం వ్యక్తం చేశారు. బ్యాలెట్‌ పేపర్లో తన పేరు ఉంటే.. ఓడిపోయేవాళ్లం కాదని తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. తాను పోటీలో ఉండి ఉంటే.. రిపబ్లికన్‌ పార్టీ అఖండ విజయం సాధించలేదంటూ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు వచ్చిన ఫలితాలను సైతం తాను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. డెమోక్రాట్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.