Iranian oil: ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. ఏప్రిల్ 19 వరకు అమలు..

  • చమురు ధరల నియంత్రణకు చర్యలు..
  • ఇరాన్ చమురుపై తాత్కాలిక సడలింపు..
  • ముప్పై రోజుల వరకు అనుమతిచ్చిన అమెరికా..
Iranian Oil

Iranian Oil

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగకుండా నియంత్రించేందుకు అమెరికా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర మార్గంలో ఉన్న ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేయడానికి 30 రోజుల పాటు అనుమతినిస్తూ (నిషేధం నుంచి మినహాయింపు) ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత రెండు వారాల్లో అమెరికా ఇలాంటి మినహాయింపు ఇవ్వడం ఇది మూడవసారి. ఇరాన్‌తో యుద్ధ వాతావరణం వల్ల చమురు సరఫరా తగ్గి, ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సముద్రంలో సిద్ధంగా ఉన్న సుమారు 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురును మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా ధరలను అదుపులో ఉంచవచ్చని అమెరికా భావిస్తోంది.

Also Read:SBI: ఎస్‌బీఐకి బిగ్ షాక్.. రూ.6,338 కోట్ల పన్ను కట్టాలని నోటీసులు..

దీనిపై బెస్సెంట్ మాట్లాడుతూ.. తాము ఇరాన్ చమురునే ఇరాన్‌కు వ్యతిరేకంగా వాడుతున్నాము. దీనివల్ల ధరలు పెరగవు… అదే సమయంలో మా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ కొనసాగుతుందన్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చమురు అమ్మడం ద్వారా వచ్చే డబ్బును ఇరాన్ తిరిగి యుద్ధం కోసమే వాడుకునే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. బ్లాక్ స్టోన్ కంప్లయన్స్ సర్వీసెస్‌కు చెందిన డేవిడ్ టాన్నెన్‌బామ్ ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ.. ఇది ఇరాన్ యుద్ధ ప్రయత్నాలకు ఆర్థికంగా సాయం చేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.

Also Read:Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

ఈ విమర్శలపై మంత్రి బెస్సెంట్ స్పందిస్తూ.. ఇది కేవలం తాత్కాలికమని స్పష్టం చేశారు. ఇప్పటికే రవాణాలో (సముద్రంలో) ఉన్న చమురుకు మాత్రమే ఈ అనుమతి వర్తిస్తుందని.. కొత్తగా చమురు తీయడానికి లేదా కొత్త ఒప్పందాలకు అవకాశం లేదని చెప్పారు. అంతేకాకుండా.. ఈ అమ్మకాల ద్వారా వచ్చే డబ్బు ఇరాన్‌కు అందకుండా కఠినమైన నిబంధనలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.