Green Card Holders: గ్రీన్ కార్డ్ హోల్డర్లకు షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Pass Port

Pass Port

అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ఒక కీలక తీర్పును వెలువరించింది. నేరాలకు పాల్పడ్డారనే అనుమానం ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లను దేశంలోకి తిరిగి రాకుండా అడ్డుకోవడం, అలాగే వారిని దేశం నుండి బహిష్కరించే ప్రక్రియను సులభతరం చేస్తూ కోర్టు 6-3 మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏదైనా నేరపూరిత ఆరోపణలు ఉన్న నివాసితులను సరిహద్దు అధికారులు దేశంలోకి రాకుండా నిలిపివేయడానికి వారిపై పక్కా ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. చైనా పౌరుడైన ముక్ చోయ్ లౌ అనే గ్రీన్ కార్డ్ హోల్డర్ కేసు ఆధారంగా ఈ తీర్పు వచ్చింది. న్యూజెర్సీలో నకిలీ వస్తువుల తయారీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను చైనాకు వెళ్లి తిరిగి వస్తుండగా జేఎఫ్‌కే విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అతను కోర్టులో నేరాన్ని అంగీకరించడంతో బహిష్కరణ వేటు పడింది. అయితే తనను అడ్డుకునే సమయానికి అధికారుల వద్ద పక్కా ఆధారాలు లేవని లౌ వాదించగా, సుప్రీంకోర్టు దానిని తోసిపుచ్చింది.

గతంలో గ్రీన్ కార్డ్ హోల్డర్లను విమానాశ్రయాల్లో నిలిపివేయాలంటే వారు నేరం చేశారనేందుకు బలమైన ఆధారాలు చూపాల్సి వచ్చేది. కానీ తాజా తీర్పు ప్రకారం.. కేవలం అనుమానం లేదా దొంగతనం, మోసం వంటి నైతిక పతనానికి సంబంధించిన నేరారోపణలు ఉంటే చాలు, అధికారులు వారిని సాధారణ ప్రయాణికులుగా కాకుండా కొత్తగా దేశంలోకి ప్రవేశం కోరే ‘దరఖాస్తుదారులు’గా పరిగణించవచ్చు. దీనివల్ల అధికారులకు వారిని వెంటనే అదుపులోకి తీసుకునే లేదా దేశ బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించే అధికారం లభిస్తుంది. నేరం రుజువైందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా, పెండింగ్ కేసుల ఆధారంగానే అధికారులు చర్యలు తీసుకోవచ్చు. ఇలాంటి స్థితిలో తమకు దేశంలోకి ప్రవేశించే అర్హత ఉందని నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా సదరు వ్యక్తిపైనే ఉంటుంది.

×
×
Ad

ఈ తీర్పుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరం నిరూపితమయ్యే వరకు ఎవరైనా అమాయకులేననే ప్రాథమిక సూత్రానికి ఇది విరుద్ధమని, కేవలం ఆరోపణల ఆధారంగా గ్రీన్ కార్డ్ రక్షణలను తొలగించడానికి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక ‘బ్లాంక్ చెక్’ ఇచ్చినట్లయిందని అసమ్మతి తెలిపిన న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కొత్త నిబంధనల వల్ల అమెరికాలో ఉంటున్న భారతీయ సంతతి ప్రజలపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుతం దాదాపు 65 లక్షల మందికి పైగా భారతీయ సంతతి వ్యక్తులు అమెరికాలో నివసిస్తున్నారు. వారిలో గ్రీన్ కార్డ్ కలిగి ఉండి, ఏవైనా చిన్నపాటి చట్టపరమైన సమస్యలు లేదా పెండింగ్ కేసులు ఉన్నవారు విదేశీ ప్రయాణాలు చేసి తిరిగి అమెరికా వచ్చేటప్పుడు సరిహద్దుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.