UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..

Upi

Upi

UPI లావాదేవీలపై వస్తున్న రకరకాల వదంతులకు, అపోహలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రజలు ఎలాంటి అనవసరమైన ఆందోళనలకు గురికావద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు. సామాన్య వినియోగదారులపై యూపీఐ లావాదేవీల కారణంగా ఎలాంటి అదనపు భారం పడదని కేంద్రం తేల్చిచెప్పింది. రోజువారీ జీవితంలో అత్యంత కీలకమైన భాగమైన డిజిటల్ పేమెంట్స్‌ను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీని ప్రకారం రూ. 2 వేల వరకు చేసే యూపీఐ పేమెంట్స్‌పై ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవు. ఈ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

అంతేకాకుండా.. ఈ డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి జీఎస్టీ భారాన్ని కూడా వినియోగదారులపై గానీ, చిన్న వ్యాపారులపై గానీ మోపబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సామాన్యులు ఎలాంటి రుసుములు చెల్లించకుండానే సులభంగా లావాదేవీలు జరుపుకోవచ్చని ఇదివరకే పలుమార్లు అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని వర్గాలలో యూపీఐ సేవలపై భారీగా చార్జీలు పడనున్నాయని, వ్యాపారులు పన్నులు చెల్లించాల్సి వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్రం కొట్టిపారేసింది.

డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చిన్న వ్యాపారుల పాత్ర కీలకమని, వారిని ప్రోత్సహించేందుకే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. యూపీఐ ద్వారా జరిగే చెల్లింపులు మునుపటిలాగే ఎలాంటి అంతరాయం లేకుండా, సురక్షితంగా, ఉచితంగా సాగిపోతాయని.. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా డిజిటల్ పేమెంట్స్‌ను నిరభ్యంతరంగా వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.