NTV Telugu Site icon

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. UPI, ATM ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే?

Atm

Atm

పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురును అందించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది EPFO ​​సభ్యులకు ప్రయోజనం చేకూరనున్నది. యూపీఐ, ఏటీఎం ద్వారా PF డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించింది. దీనికి సంబంధించి దాదాపు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిఫార్సును ఆమోదించింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది మే నెలాఖరు లేదా జూన్ నాటికి పీఎఫ్ సభ్యులు యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చని అన్నారు.

Also Read:Realme P3 Ultra 5G: 6.83 అంగుళాల డిస్ ప్లే, 6000mAh బ్యాటరీ ఫోన్ రూ.3000 తగ్గింపుతో సేల్ ప్రారంభం

పీఎఫ్ ఖాతాదారులు తమ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ను నేరుగా యూపీఐలో చెక్ చేసుకోవచ్చు. అర్హత ఉంటే మీరు తక్షణమే రూ. 1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపారు. నగదు బదిలీ కోసం మీకు నచ్చిన బ్యాంక్ ఖాతాను ఎంచుకోవచ్చని చెప్పారు. EPFO నిబంధనలను సరళీకృతం చేసిందని, ఉపసంహరణ ఎంపికలను గణనీయంగా విస్తరించిందని అన్నారు. EPFO సభ్యులు ఇప్పుడు అనారోగ్యంతో పాటు గృహనిర్మాణం, విద్య, వివాహం కోసం నిధులను ఉపసంహరించుకోవచ్చు.

Also Read:Smartphones: వచ్చే నెలలో రాబోయే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

EPFO తన అన్ని కార్యాకలాపాలను డిజిటలైజ్ చేయడంలో గణనీయమైన పురోగతి సాధించిందని సుమితా దావ్రా తెలియజేశారు. భారతదేశ డిజిటల్ ఆర్థిక పరివర్తనలో రాబోయే UPI, ATM ఆధారిత PF ఉపసంహరణ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఇది లక్షలాది మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 147 ప్రాంతీయ కార్యాలయాల ద్వారా EPFO ప్రతి నెలా 10-12 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంటోంది. ప్రస్తుతం 7.5 కోట్లకు పైగా క్రియాశీల సభ్యులు ఉన్నారు.