SP MLA suspended: ఉత్తరప్రదేశ్‌లో 24 గంటల పాటు జరిగిన నాన్-స్టాప్ అసెంబ్లీ సెషన్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కానీ దాని ఫలితం మాత్రం మరింత ఆసక్తికరంగా కనిపించింది. అసలు ఏం జరిగిందంటే.. ప్రతిపక్ష ఎస్పీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పూజా పాల్.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించారు. కట్ చేస్తే.. ఆమె సీఎంపై ప్రశంసలకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈక్రమంలో ఆమెను సమాజ్‌వాదీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లేఖ విడుదల చేశారు.
READ MORE: Ashok Chakra 24 Spokes: అశోక చక్రంలో ఉన్న 24 ఆకుల (గీతలు) అర్థం ఏంటో తెలుసా?
అసెంబ్లీలో ఆసక్తికరం..
ఉత్తరప్రదేశ్ ఎలా ఉండాలి, రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరగాలి, తదితర అంశాలపై దాదాపు 24 గంటల పాటు నిరంతర సమావేశం జరిగింది. సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు వారివారి అభిప్రాయాలను వెల్లడించారు. ఈక్రమంలో అసెంబ్లీలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటచేసుకుంది. ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్.. తన ప్రసంగంలో సీఎం యోగిని ప్రశంసించారు. సీఎం రాష్ట్రంలో మాఫియాలను లేకుండా నాశనం చేశారని కొనియాడారు. అతిక్ అహ్మద్ వంటి గ్యాంగ్ స్టర్లను ఏరిపారేశారని, జీరో టాలరెన్స్ వంటి విధానాలను తీసుకువచ్చారని, తనలాంటి చాలా మంది మహిళలకు న్యాయం చేశారని అన్నారు. ఎవరూ తన మాట విననప్పుడు, సీఎం యోగి తన మాట విన్నారని గుర్తు చేశారు. నేడు రాష్ట్రం మొత్తం సీఎం వైపు నమ్మకంగా చూస్తోందని అన్నారు.
గతంలో కూడా పూజా పాల్ చాలాసార్లు సీఎం యోగి, హోంమంత్రి అమిత్ షా చిత్రాలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పుడు కూడా పార్టీ ఆమెను బహిష్కరించలేదు. కానీ అంసెబ్లీ సాక్షిగా సీఎం యోగిపై ప్రశంసలు చేయడం పార్టీ పెద్దలకు నచ్చలేదు. ఈక్రమంలో ఆమెను పార్టీ నుంచి అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సస్పెండ్ చేస్తూ లేఖ విడుదల చేశారు. ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరని హెచ్చరించిన తర్వాత కూడా ఆ కార్యకలాపాలను ఆపలేదు. మీ కార్యకలాపాలతో పార్టీ చాలా నష్టపోయింది. మీరు చేసిన పని పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో తక్షణమే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. దీనితో పాటు, మిమ్మల్ని పార్టీ అన్ని ఇతర పదవుల నుంచి కూడా తొలగిస్తున్నట్లు’.. లేఖలో పేర్కొన్నారు.
READ MORE: Jammu & Kashmir Cloudburst: జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. 12 మందికి పైగా..!
