NTV Telugu Site icon

Crop Loss: రాష్ట్రంలో అకాల వర్షాలు.. అన్నదాతకు అపార నష్టాలు

Rains

Rains

Crop Loss Due to Rains in Telangana: రాష్ట్రంలో అనుకోకుండా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే.. ప్రభుత్వం కొనేలోపే ఇలా వర్షాలు రావడం వల్ల వర్షపు నీరు రైతుల కళ్లలో కన్నీరుగా మారుతోంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని వడగళ్ల వర్షానికి పంటలు తీవ్ర నష్టం జరిగింది. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. వడగళ్లు పడటంతో రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. పొలాల్లో, రోడ్డుపై ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యం కల్లాల్లోకి తీసుకువచ్చి నెల రోజులు అయినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్ద అయిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి ఆదివారాల కురిసిన వడగళ్ల వాన రైతులకు శాపంగా మారింది. రైతులకు చేతికొచ్చిన పంటను నేలపాలు చేసింది. ఇప్పటికే రెండు నెలల క్రితం కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను శని ఆదివారాలు కురిసిన వర్షంతో కోలుకోలేని స్థితికి రైతులు చేరారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆదివారం అంధకారం నెలకొంది. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడడంతో నర్సంపేట-నెక్కొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, ఖానాపురం మండలంలో వరిపంటలు తుడిచిపెట్టుకుపోయాయి. పదిహేను వేల ఎకరాల మేర భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లింది. రెండు గంటల పాటు వడగండ్ల బీభత్సంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈదురుగాలుల బీభత్సంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న మిర్చి పంటలు నేల వాలాయి. భీమదేవరపల్లి మండలంలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలంలో వరి ధాన్యం నేల రాలటంతో పాటు కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. జనగామ, బచ్చన్నపేట మండలాల్లో నష్టపోయిన పంట నష్టాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరిశీలించారు.

Read Also: Unemployment Protest Rally: నేడు ఖమ్మంలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ర్యాలీ

గత మూడు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో వరి, మామిడి, మొక్కజొన్న, ఇతర పంటలు వేసిన రైతులు వర్షాల వల్ల నష్టపోయారు. ఖమ్మం జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలు చేతికండ కుండా పోయాయి. మొక్కజొన్న, వరి, మామిడి పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఖమ్మం డివిజన్లోని పాలేరు, మధిర నియోజకవర్గాల్లో ఈ నష్టం ఎక్కువగా ఉంది .ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా అకాల వర్షాలు నిన్న సాయంత్రం కురిశాయి. భారీగా వడగండ్లు పడటంతో పంటలన్నీ నేలకొరిగి పోయాయి .దాదాపు ఇంకొక 15 ,20 రోజుల్లో పంటలు ఇంటికొచ్చే సమయంలో వడగండ్లు అకాల వర్షానికి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఏరుకోటానికి కూడా వీలు లేనివిధంగా పంటలు దెబ్బతిన్నాయి. అయితే ప్రభుత్వం నష్టపరిహారం కోసం నష్టపోయిన వ్యవసాయ క్షేత్రాల పరిశీలించడం కోసం అధికారులకు ఫోన్ చేస్తున్నప్పటికీ వారు మాత్రం స్పందించడం లేదు. గతంలో ఇస్తామన్న నష్టపరిహారం కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో వడగండ్ల వాన ఓ రైతు మరణానికి కారణమైంది. వడగండ్లతో వరి పంట పూర్తిగా రాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందనే మనోవేదనతో ఓ రైతు ప్రాణాలు వదిలాడు. పంబలస్వామి అనే రైతు పంట నష్టపోయాననే మనోవేదన చెంది ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి ధాన్యం వడగళ్ల ధాటికి పొలాల్లోనే రాలిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులు అకాల వర్షాలతో నిండా మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం రంగు మారటమే కాకుండా.. ఆరబెట్టడానికి వాతావరణం అనుకూలించట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వమే ఈ ధాన్యాన్ని కొనుగోలు ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Show comments