NTV Telugu Site icon

Telangana Railway: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి సమాధానం.. ఏమన్నారంటే?

Telangana Railway Projects

Telangana Railway Projects

Railway Projects in Telangana: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. రైల్వే ప్రాజెక్టులు జోనల్ వారీగా, డివిజన్ వారీగా మంజూరు అవుతాయని.. వాటిలో కొన్ని సార్లు రాష్ట్రాల సరిహద్దులు కూడా మారుతుంటాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్ 1, 2022 వరకు రూ.30,062 కోట్ల విలువైన 2,930కిమీల రైల్వే లైన్లు వివిధ దశల్లో ఉన్నాయని.. ఇందులో 8 కొత్తలైన్లు, 5 డబ్లింగ్ లైన్లు ఉన్నాయన్నారు. మార్చి 22 వరకు రూ.6,514 కోట్ల విలువైన 272 కిలోమీటర్ల రైల్వే లైను పూర్తి అయ్యిందన్నారు. 8 కొత్తలైన్లలో 1053 కి.మీలకు రూ.16,686 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించగా.. రూ.3,596 కోట్ల విలువైన 221కి.మీల లైన్ పూర్తి అయ్యిందని రైల్వే మంత్రి వెల్లడించారు. 5 డబ్లింగ్ ప్రాజెక్టుల దూరం 1337కి.మీలు కాగా రూ.13,376 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. అందులో రూ.2,918 కోట్లతో 52కి.మీల డబ్లింగ్ పనులు పూర్తి అయ్యాయని కేంద్రమంత్రి తెలిపారు.

మనోహరాబాద్ – కొత్తపల్లి, భద్రాచలం -కొవ్వూరు, అక్కన్నపేట – మెదక్, భద్రాచలం – సత్తుపల్లి, హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ ఫేస్ -2 ఈ ఐదు ప్రాజెక్టులకు గాను రూ.7,350 కోట్ల గాను అంచనా ఉండగా.. రూ.2,588 కోట్లు ఇప్పటికే ప్రాజెక్టుల మీద ఖర్చు జరిగింది. రూ.1,279 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తన వాటా కింద జమచేసింది. ఇంకా రూ.986 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తన వాటా కింద జమచేయాల్సి ఉంది. రైల్వే ప్రాజెక్టుల కోసం తెలంగాణలో 2095 హెక్లార్ట రెవెన్యూ భూమి, 56 హెక్టార్ల ఫారెస్ట్ భూమి అవసరం కాగా ఇప్పటి వరకు తెలంగాణ సర్కారు 1918 హెక్టార్ల రెవెన్యూ భూమిని, 41 హెక్టార్ల ఫారెస్ట్ భూమిని సేకరించింది. ఇంకా 41 హెక్టార్ల రెవెన్యూ భూమి, 15 హెక్టార్ల అటవీభూమిని తెలంగాణ ప్రభుత్వం సేకరించాల్సి ఉంది.

రైల్వే బడ్జెట్‌లో భాగంగా మౌలిక వసతులు కల్పన, రక్షణా పనుల కోసం తెలంగాణ రైల్వేకు 2014-19 వరకు రూ.1,110 కోట్లు కేటాయింపులు జరగగా,
2019-20 కి గాను రూ.2,056 కోట్లు
2020-21కి గాను రూ.2,602 కోట్లు
2021-22కు రూ.2,486 కోట్లు
2022-23కు రూ.3,048 కోట్లు…
2023-24కు గాను ఏకంగా రూ.4,418 కోట్లు కేటాయింపు కేంద్ర రైల్వే శాఖ చేసింది.

2009-14 మధ్యన ఏడాదికి సరాసరి 17.4 కి.మీ.ల రైల్వే కొత్తలైన్లు, డబ్లింగ్ పనులు జరగగా.. 2014 – 2022 మధ్యన ఏడాదికి సరాసరి 55కి.మీ.ల పనితో ఏకంగా 440కి.మీ.ల పనిపూర్తైంది. ఇందులో 229 కి.మీ.ల కొత్తలైన్లు, 211కి.మీ.ల డబ్లింగ్‌ లైన్‌ ఉంది.

స్పందించని తెలంగాణ సర్కార్..
తెలంగాణలో ఎంఎంటీఎస్ ఫేస్ -2 కోసం రూ.816.55 కోట్లు అంచనా వేయగా ఈ ఖర్చు రైల్వే, తెలంగాణ ప్రభుత్వం 1:2 నిష్పత్తిలో భరించాల్సి ఉంది. ఇందులో 544.36 కోట్లు తెలంగాణ రాష్ట్రప్రభుత్వ వాటా ధనంలో కేవలం రూ.279.02 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్ విడుదల చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. మిగిలిన 265.34 కోట్ల కోసం కేంద్ర రైల్వే శాఖ అనేకమార్లు తెలంగాణ సర్కార్ కు లేఖలు రాసినా పెడచెవిన పెట్టిందన్నారు. ఎంఎంటీఎస్ ఫేస్ -2 కోసం కేంద్ర రైల్వే శాఖ తన వాటా ధనం కన్నా అధికంగా కేటాయించింది. ఈ ప్రాజెక్టులు ఎక్కడా కూడా తెలంగాణ భూములు అవసరం కూడా రాలేదు. దేశంలో రైల్వే ప్రాజెక్ట్ ల పూర్తికోసం రైల్వే శాఖ మిగిలిన అన్ని శాఖలతో వేగవంతమైన సంప్రదింపులు చేస్తోంది. రైల్వే ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రాష్ట్రాల నుంచి భూసేకరణ జరగాలి. అటవీశాఖ నుంచి క్లియరెన్సులు రావాలి. రాష్ట్రాల వాటాధనం వెంటనే జమ కావాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. స్థానికంగా శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. ఇవన్నీటి కోసం రైల్వే శాఖలో గతిశక్తి డైరక్టరేట్ నియామకంతో పాటు ప్రయారిటీ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రాలతోనూ, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడటానికి రైల్వేశాఖ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.