NTV Telugu Site icon

రాహుల్‌పై కేంద్రమంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్

రాహుల్‌ గాంధీపై కేంద్రమంత్రి రావు సాహెబ్ దన్వే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఆయన కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ నేతలు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జన ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే.. కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రంగా విరురుచుకుపడ్డారు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎవరికీ ఉపయోగపడే వ్యక్తి కాదని, ఆయన ఆంబోతు వంటివారంటూ కామెంట్ చేశారు.. ఆయన అన్ని చోట్లకు తిరుగుతూ ఉంటారని, అయినా ప్రయోజనం ఏమీ ఉండదన్న రావు సాహెబ్ దన్వే.. తాను ఇరవయ్యేళ్ల నుంచి లోక్‌సభలో ఉన్నానని, రాహుల్ పనితీరును గమనించానంటూ చెప్పుకొచ్చారు.

ఇక, రావు సాహెబ్ కామెంట్లను తప్పుబట్టింది కాంగ్రెస్‌ పార్టీ… రావు సాహెబ్ వ్యాఖ్యలు అమర్యాదకరంగా, దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని.. ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే.. దన్వే అన్ని రకాల హద్దులను దాటిపోయారన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు అమర్యాదకరంగా, దిగ్భ్రాంతికరంగా ఉన్నాయన్నారు. కాగా, రాజకీయ నేతలు.. ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ సెటైర్లు వేయడం.. పరిపాటి.. కానీ, అవి కొన్నిసార్లు శృతిమించిపోయి విమర్శలకు దారితీసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.