NTV Telugu Site icon

Kishan Reddy: ప్రజాజీవనాన్ని సౌలభ్యంగా మార్చడమే మోదీ సర్కారు లక్ష్యం

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 5 రహదారులను (రిచర్డ్‌సన్ రోడ్, ప్రోట్నీ రోడ్, బయామ్ రోడ్, అమ్ముగూడ రోడ్, అల్బయిన్ రోడ్) సామాన్య ప్రజల వినియోగానికి తెరిచేందుకు రక్షణ శాఖ అనుమతించడం పట్ల కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగానూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ‘సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రిచర్డ్‌సన్, ప్రోట్నీ, బయామ్, అమ్ముగూడ, అల్బయిన్ రోడ్లను సామాన్య ప్రజల రాకపోకల కోసం అనుమతించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల రాజ్ నాథ్ సింగ్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. పలుమార్లు ఈ అంశంపై వారిని కలిసి సమస్యను విన్నవించాను. రోడ్లను తెరిచేందుకు వారు మనస్ఫూర్తిగా అంగీకరించారు’ అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

Read Also: CPI Narayana: సాంకేతిక అంశంతో రాహుల్ గాంధీని వేధిస్తున్నారు.. ఈ పాపం ఊరికే పోదు

‘జాతీయ భద్రత, ప్రజలకు సౌలభ్యం అనే రెండు సున్నితమైన అంశాల విషయంలో అన్ని పక్షాలు కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన సందర్భంలో.. కంటోన్మెంట్ ప్రాంతానికి నీరు, విద్యుత్ సరఫరా నిలిపేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బెదిరింపులు.. తదితర అంశాలను కూడా తెలియజేశానని కిషన్ రెడ్డి వెల్లడించారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాజీవనాన్ని సౌలభ్యం చేసేందుకు కృషిచేస్తోందని కేంద్రమంత్రి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.