NTV Telugu Site icon

Kishan Reddy: బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ దాడిని ఖండిస్తూ కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తూ.. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది పిరికిపిందల చర్య.. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నానని అన్నారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర బీజేపీ ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడటం దుర్మార్గం అని ఆరోపించారు. బీజేపీ కార్యాలయం ముందు వరకు చేరుకుని రాళ్లు, కర్రలతో కాంగ్రెస్ గూండాలు పోలీసుల సమక్షంలో, పోలీసులతో కలిసి వచ్చి ఆఫీస్ పైన, బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు, భౌతిక దాడులకు తావు లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి రాజకీయాలకు తాము పూర్తి వ్యతిరేకమని.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి కక్షపూరిత, ద్వేషపూరిత రాజకీయాలు రాష్ట్రంలో పెరిగిపోయాయని ఆరోపించారు. గతంలో సొంతపార్టీకి చెందిన ముఖ్యమంత్రులను గద్దెదించేందుకు మతకల్లోలాలు సృష్టించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం అని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అసమర్థ పాలనతో ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న తరుణంలో.. అసహనంతో ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

Formula E Car Race Case : కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు..

ఇలాంటి దాడులను ఆపకపోతే.. ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పోలీసుల సమక్షంలో బీజేపీ కార్యాలయంపై దాడిచేసి.. తమ కార్యకర్తలను గాయపరిచే విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరగదని అన్నారు. ఖబడ్దార్, అసహనం కోల్పోయి మీరు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తిరగబడితే.. దేశంలో కాంగ్రెస్ కు ఉన్న కొద్దిపాటి నాయకులు తిరుగలేని పరిస్థితులు ఏర్పడుతాయని తెలిపారు. రాష్ట్రంలో ఈ రకమైన దాడులతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు.

గతంలోనూ ప్రధానమంత్రికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు.. తీవ్ర అసహనంతో తక్కువ కులంవాడు, చాయ్ అమ్ముకునే వ్యక్తి ఎలా ప్రధాని అవుతారని అన్నారు. మౌత్ కా సౌదాగర్, హిట్లర్ వంటి ఎన్నో అవాక్కులు, చెవాక్కులు పేలారు.. దీన్ని ఖండిస్తూ బీజేపీ ఎక్కడైనా దాడులు చేసిందా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు ఒక్కసారి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక్కసారైనా క్షమాపణలు చెప్పారా..? అలాంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శించారు. తాము దీనికి ప్రతిగా సమాధానం చెబితే.. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు దేశంలో రోడ్లపై తిరగలేడు.. కానీ ఇది తమ సంస్కృతి కాదన్నారు. మీ సంస్కృతిని మార్చుకోండి. ఖబడ్దార్ అని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

Show comments