హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆదివారం నారాయణగూడ ప్రాంతం మార్మోగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో అయ్యప్పస్వామి మహా పడిపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస వసతులు కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరారు. ఏర్పాట్ల లేమి కారణంగా తెలుగు రాష్ట్రాల భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
CM Revanth: మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశానన్న కేంద్రమంత్రి.. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణసహకారం ఉంటుందని తెలిపారు. వీలైనంత త్వరగా.. ప్రత్యేక చొరవతీసుకుని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాన్ని మోహరించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే అంతకుముందు కావ్య కిషన్ రెడ్డి దంపతులు అయ్యప్ప విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం పదునెట్టాంబడిపై స్వామి వారికి షోడశోపచారాలు నిర్వహించారు. తర్వాత అయ్యప్ప స్వాములు శరణుఘోషతోపాటు, భజనలు, పాటలతో ఆ ప్రాంతం మార్మోగింది.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అయ్యప్ప భక్తుల పడిగాపులు..
గురుస్వామి ఆత్రేయాచార్యుల చేతుల మీదుగా జరిగిన పూజా కార్యక్రమంలో గాయకుడు జడల రమేష్ ఆలపించిన పాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. భజన బృందం, ఆర్కెస్ర్టా, దేవతా మూర్తుల వేషధారణతో కళాకారులు నృత్యాలతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గత 23 ఏళ్లుగా ఘనంగా అయ్యప్పస్వాములతో మహా పడిపూజోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు తెలంగాణ తెలుగు ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే.. అయ్యప్ప దర్శనం కోసం వెళ్లి తమిళనాడులో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ వాసులు.. ముగ్గురు మృతి పట్ల కేంద్ర మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.