Union Home Ministry: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై బుధవారం కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహిస్తోంది. తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్‌లో కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ సాగుతోంది. ఏపీ ప్రభుత్వం తరఫున ఆదిత్యనాథ్ దాస్, రావత్, ప్రేమ చంద్రారెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, విభజన చట్టం అమలుపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే దేశరాజధానిలోని ఏపి భవన్ విభజనపై తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. ఐతే తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై గతంలో ఎన్నో మీటింగులు జరిగినప్పటకి ఏ ఒక్క సమస్యా కొలిక్కి రాలేదు. రేపు జరిగే సమావేశంలో ఏం తేలుస్తారనే దానిపై చర్చ మొదలైంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఎనిమిదిన్నరేళ్ళు గడుస్తోంది. రోజులు గడిచిపోతున్నాయే తప్ప-ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు మాత్రం పరిష్కారానికి నోచుకోవట్లేదు. ముఖ్యంగా ఆస్తుల పంపకాల అంశం ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉంది. ఢిల్లీలో ఏపీ, తెలంగాణా భవన్‌లు ఒకే బిల్డింగులో ఉన్నాయి. గతంలో ఉన్న ఏపి భవన్‌ను విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు పంచుకున్నారు. కొన్ని గదులు తెలంగాణకు, మరికొన్ని ఆంధ్రప్రదేశ్‌కు, ఖాళీగా ఉన్న స్థలాలతో పాటూ, స్టాఫ్ క్వార్టర్లను సైతం ఇలాగే విభజించారు.ఇక…ఇపుడు పూర్తిస్థాయిలో విభజన జరగాల్సిన సమయం వచ్చిందంటున్నారు అధికారులు.
దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్ విభజన అంశం సైతం పెండింగులోనే ఉంది. గతంలో సైతం ఏపీ భవన్ విభజనపై సమావేశాలు జరిగాయి. అయితే పంపకాల విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వ్యవహారం సెటిట్ కాలేదు. ఏపీ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలపై తెలంగాణ తన వైఖరిని ఈ భేటీలో స్పష్టం చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ తన సూచనలను చేయాల్సి ఉంటుంది. ఆమోదయోగ్యంగా లేకపోతే కేంద్రమే ఈ సమస్యను పరిష్కరించనుందని తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి రావచ్చని సమాచారం. ఢిల్లీలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఏపీ భవన్ స్థలాన్ని జనాభా నిష్పత్తిన పంచాల్సి ఉంటుంది. ఇతర ఆస్తులను కూడా ఈ నిష్పత్తి ప్రకారమే పంచేలా విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ 20 ఎకరాల్లో ఏపీ వాటాగా 58.32 శాతం అంటే 11 ఎకరాలకు పైగా దక్కుతుంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. మొత్తానికి…రేపు జరగబోయే సమావేశంలో ఏం తేలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.